అరుదైన వ్యాధి.. మా బాబును కాపాడరూ..

కుమారుడి బోసినవ్వులు చూసి ఆనందపడిన తల్లిదండ్రులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పుట్టిన నాలుగు నెలల్లోనే తరచూ జ్వరం వస్తుండటం వారిని ఆవేదనకు గురి చేసింది.

Updated : 25 Sep 2023 08:30 IST

వైద్యం కోసం తల్లిదండ్రుల ఆరాటం
ఆదుకోవాలంటూ దాతలకు విన్నపం

న్యూస్‌టుడే, గొల్లపల్లి: కుమారుడి బోసినవ్వులు చూసి ఆనందపడిన తల్లిదండ్రులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పుట్టిన నాలుగు నెలల్లోనే తరచూ జ్వరం వస్తుండటం వారిని ఆవేదనకు గురి చేసింది. స్థానిక ఆస్పత్రుల్లో చూపించినా కారణం తెలియకపోవడంతో హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారికి అరుదైన వ్యాధి ఉందని తెలిసి హతాశులయ్యారు. అప్పటి వరకు చిన్నారి వైద్యం కోసం రూ.10 లక్షలకు పైగా అప్పు చేసిన ఆ తల్లిదండ్రులు..ఇప్పుడు చికిత్సకు మరో రూ.25 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో ఏమి చేయాలో తెలియక ఆవేదనలో ఉన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన బోడకుంటి శ్రీనివాస్‌- లాస్య దంపతులకు నాలుగు నెలల క్రితం కుమారుడు అయాన్ష్‌ జన్మించాడు. బాబు మొదట ఆరోగ్యంగా ఉన్నా రోజులు గడిచే కొద్దీ తరచూ జ్వరంతో బాధపడేవాడు. స్థానికంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగినా సమస్య గుర్తించలేకపోయారు. చివరికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ బాబు ప్రైమరీ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్‌ (క్రానిక్‌ గ్రాన్యులోమాటస్‌ డిసీజ్‌)అనే జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, ఎముక మజ్జ మార్పిడి (బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చేయాలని, ఇందుకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. బాలుడి చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని తెలియడంతో ఆర్థిక సాయం చేసి తమ కుమారుడిని బతికించాలని శ్రీనివాస్‌-లాస్య దంపతులు కోరుతున్నారు. చేయూత అందించే దాతలు బాలుడి తండ్రి శ్రీనివాస్‌ను ఫోన్‌ నంబరు 9502772429లో సంప్రదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని