వారు అనర్హులు

రాష్ట్ర మంత్రిమండలి నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పదవుల కోసం సిఫార్సు చేసిన ఇద్దరి పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు.

Published : 26 Sep 2023 05:40 IST

నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లపేర్లు తిరస్కరించిన గవర్నర్‌
దస్త్రాలు వెనక్కి.. సీఎం, సీఎస్‌లకు తమిళిసై లేఖ
రాజకీయాలతో సంబంధం లేని   అర్హులనే సిఫార్సు చేయాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రిమండలి నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పదవుల కోసం సిఫార్సు చేసిన ఇద్దరి పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, భారాస నేత దాసోజు శ్రవణ్‌ల పేర్లను ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఆర్టికల్‌ 171(5) మేరకు గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా కింద వారిద్దరికీ తగిన అర్హతలు లేవని, కళలు, సాహిత్యం, సైన్స్‌ రంగాల్లో వీరిద్దరూ పనిచేయనందున.. నామినేట్‌ చేయడం కుదరదంటూ.. ఈనెల 19వ తేదీన దస్త్రాలను వెనక్కి పంపారు. సత్యనారాయణ, శ్రవణ్‌ల తిరస్కరణకు కారణాలు వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సీఎస్‌ శాంతికుమారికి లేఖలు రాశారు. సహకార ఉద్యమం, సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం ఉన్న, అర్హత గల వ్యక్తులను మంత్రులు సిఫార్సు చేస్తే.. ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎందరో అర్హులైన ప్రముఖులున్నా వారిని పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్నవారి పేర్లను సిఫార్సు చేయడం సరికాదని, ఇకపై రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని ఆమె సూచించారు.

తిరస్కరణకు ఇవీ కారణాలు

‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171(5)ల కింద సభ్యులను నామినేట్‌ చేయడానికి గవర్నర్‌కు అధికారం ఉంది. ఆచరణాత్మక అనుభవం, పరిజ్ఞానం, సాహిత్యం, సైన్స్‌, కళ, సహకార ఉద్యమం, సామాజిక సేవలో ఉన్న వ్యక్తులను కలిగి ఉంటుంది. కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అయితే సాహిత్యం, సైన్స్‌, కళల్లో పరిజ్ఞానం లేదని, సహకార ఉద్యమంతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్‌ గానీ ఇతర వర్గాల నుంచి కానీ సమాచారం లేదు.

దాసోజు శ్రవణ్‌ సైతం రాజకీయాలతో పాటు కార్పొరేట్‌, విద్యారంగాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కానీ సాహిత్యం, సైన్స్‌, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవల్లో ప్రత్యేక పరిజ్ఞానం లేదు గానీ కొద్దికాలం పనిచేసినట్లు ఉంది. 171(5) అధికరణ కింద ఉండాల్సిన అర్హతలకు సంబంధించిన స్వల్ప నివేదిక మినహా ఇతర లిఖితపూర్వక సమాచారమేదీ లేదు. ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు ఇతర సంస్థలు సైతం ఆయనకు పై అర్హతలున్నట్లు నివేదించలేదు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్‌ చేయాలో, ఎవరిని చేయకూడదో ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది’’ అని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని