దిల్లీ మద్యం కేసులో.. ఎమ్మెల్సీ కవితకు ఊరట

దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాత్కాలిక ఊరట లభించింది. నవంబరు 20వ తేదీ వరకు ఆమెను విచారణకు పిలవవద్దని ఈడీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Published : 27 Sep 2023 05:15 IST

నవంబరు 20 వరకు విచారణకు పిలవొద్దు
ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాత్కాలిక ఊరట లభించింది. నవంబరు 20వ తేదీ వరకు ఆమెను విచారణకు పిలవవద్దని ఈడీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దిల్లీ మద్యం కేసులో మహిళగా ఉన్న తనను ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం పిటిషన్‌ విచారణ చేపట్టింది. కవితను తాము విచారణకు పిలవడం లేదని, ఒకవేళ పిలిచినా పది రోజుల ముందుగానే సమాచారం ఇస్తామని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు ధర్మాసనానికి తెలిపారు. విచారణకు పిలిచే అంశంపై ఈడీ స్పష్టతనివ్వాలని కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ‘ఈ విషయాన్ని మేం వింటాం.. అప్పటివరకు ఆమెను ప్రశ్నించేందుకు పిలవొద్దు’ అని స్పష్టం చేశారు. మహిళలను దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు పిలవడం, ప్రశ్నించడంపై కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ జోక్యం చేసుకున్నారు. ‘మహిళలకు కొన్ని రక్షణలు ఉండాలి. అదే సమయంలో సాక్షిగా, నిందితురాలిగా మరేవిధంగానూ ఓ మహిళను ప్రశ్నించడానికి పిలవొద్దని మీరు చెప్పకూడదు. చట్టాల దుర్వినియోగంతో పలు ఇతర రకాల కేసులుంటాయి. అన్నింటినీ ఒకే కోవలో చూడలేం’ అని వ్యాఖ్యానించారు. దీనికి సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి స్పందిస్తూ పిటిషన్‌ విచారణలో ఉండగానే సమన్లు జారీ చేశారని తెలుపుతుండగా ఈడీ తరఫు న్యాయవాది ఎస్‌.వి.రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను విచారణకు పిలిచినప్పుడు మహిళా అధికారులు ఉంటున్నారని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ అనేక రకాల కేసులుంటాయని, అన్నింటినీ ఒక వాక్యంలోనే తేల్చేయలేమన్నారు. అనంతరం కేసు తదుపరి విచారణను ధర్మాసనం నవంబరు 20వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు