అయోమయం.. గందరగోళం

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పొరపాట్లతో అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది.

Updated : 27 Sep 2023 06:57 IST

గ్రూప్‌-2కు చదవాలా? గ్రూప్‌-1కు సిద్ధం కావాలా?
పోటీ పరీక్షలకు సన్నద్ధతపై ఉద్యోగార్థుల్లో ఆందోళన

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పొరపాట్లతో అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ గతంలో వారిలో గందరగోళం సృష్టించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై నెలకొన్న తాజా పరిణామాలతో నవంబరులో జరిగే గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధతపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ ప్రకారం మార్కులు అంచనా వేసుకున్న పలువురు అభ్యర్థులు ప్రధాన పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. అందులో ప్రతిభ చూపలేకపోయామని భావించినవారు గ్రూప్‌-2పై దృష్టి సారించారు. తాజా పరిణామాల నేపథ్యంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2లలో దేనిపై దృష్టి పెట్టాలన్న విషయమై గందరగోళం నెలకొంది. మరోవైపు, గ్రూప్‌-1 మినహాయించి పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు అభ్యర్థుల ప్రతిభ ఆధారితంగా జనరల్‌ ర్యాంకు జాబితాలను వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

గ్రూప్‌-2 పరీక్షకు 5.51 లక్షల మంది...

గ్రూప్‌-1 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 90 శాతానికిపైగా అభ్యర్థులు గ్రూప్‌-2 పరీక్షలకూ దరఖాస్తు చేశారు. గ్రూప్‌-2కు మొత్తం 5.51 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తొలుత గ్రూప్‌-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూలు జారీ చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దయింది. దాన్ని జూన్‌ 11న రెండోసారి నిర్వహించారు. జులై 1న గ్రూప్‌-4 పరీక్ష జరిగింది. వరుస పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యామని, గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని, దాన్ని వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పరీక్షను నవంబరు 2, 3 తేదీలకు కమిషన్‌ వాయిదా వేసింది. దానికి సన్నద్ధమవుతున్న తరుణంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు గ్రూప్‌-1 ప్రధాన పరీక్షపై దృష్టి పెట్టిన అభ్యర్థులు.. ఆ ప్రయత్నాన్ని విరమించి నెల రోజుల్లో జరిగే గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధం కావాలంటే సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనరల్‌ ర్యాంకుల ప్రకటనకు కమిషన్‌ నిర్ణయం!

టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 19 ఉద్యోగ ప్రకటనలకు రాతపరీక్షలు నిర్వహించింది. అయితే ప్రధానమైన గ్రూప్‌-1, గ్రూప్‌-2లు ఇంకా పూర్తికాలేదు. గ్రూప్‌-4 పరీక్ష జరిగినప్పటికీ తుది కీ వెల్లడించలేదు. గ్రూప్‌-3, డీఏవో, వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాతపరీక్షల తేదీలు ఖరారు కాలేదు. గ్రూప్‌-4తో పాటు ఇప్పటివరకు పరీక్షలు జరిగిన నోటిఫికేషన్లకు ఒక్కొక్కటిగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మెరిట్‌ ర్యాంకులు ప్రకటించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇప్పటికే అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు(ఏఈఈ) పోస్టులకు జనరల్‌ ర్యాంకుల జాబితాలు వెల్లడించింది. న్యాయ వివాదాలున్న నోటిఫికేషన్లను పక్కనపెట్టి మిగతావాటికి జాబితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేసింది.

మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తరువాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసి.. తుది నియామక కార్యాచరణ మొదలుపెట్టాలని భావిస్తోంది. అప్పటివరకు ప్రతిభ ఆధారిత ర్యాంకులు ప్రకటిస్తే మార్కులు తెలుసుకునేందుకు అభ్యర్థులకు వీలుంటుందని అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు