గ్రూపు-1 రద్దు సబబే

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సబబేనని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. గతంలో ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించినపుడు మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని, అలా తీసుకున్నట్లు కనిపించలేదంది.

Updated : 28 Sep 2023 07:09 IST

ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాలన్న సింగిల్‌ జడ్జి నిర్ణయం సమర్థనీయమే
పోస్టుల్లో 10-15 మంది అనర్హులు చేరినా పరీక్ష లక్ష్యం దెబ్బతిన్నట్లే
నామినల్‌ రోల్స్‌ తనిఖీలోనూ సరైన పద్ధతిలేదు
టీఎస్‌పీఎస్సీ అప్పీలును కొట్టివేసిన హైకోర్టు

 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సబబేనని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. గతంలో ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించినపుడు మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని, అలా తీసుకున్నట్లు కనిపించలేదంది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. పరీక్షను రద్దు చేసి తిరిగి నిబంధనల ప్రకారం నిర్వహించాలన్న సింగిల్‌ జడ్జి నిర్ణయం సమర్థనీయమేనని జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది.  మొత్తం 504 పోస్టుల్లో 10 నుంచి 15 మంది అనర్హులు చేరినా పరీక్ష నిర్వహణ లక్ష్యం దెబ్బతిన్నట్లేనని పేర్కొంది.  మంగళవారం ధర్మాసనం అడిగిన వివరాలను కమిషన్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ సమర్పించారు. ‘గత అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2,85,916 మంది హాజరయ్యారు. 2,83,346 మందికి బయోమెట్రిక్‌ నమోదు చేశారు. జూన్‌ 11న నిర్వహించిన పరీక్షకు 2,33,506 మంది హాజరయ్యారు’ అని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘‘అక్టోబరులో జరిగిన పరీక్షకంటే జూన్‌లో హాజరు సంఖ్య సుమారు 50 వేలు తగ్గింది. అవకతవకలు జరిగి ఉంటాయనడానికి అవకాశం ఉంది. 50 వేల మంది అవకాశాలను కోల్పోయారు. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. అలాగే జూన్‌లో పరీక్ష జరిగిన రోజున 2,33,248 మంది హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. 17 రోజుల తరువాత వెబ్‌నోట్‌ ప్రకారం 2,33,506 మంది హాజరైనట్లు ప్రకటించింది. 258 మంది అభ్యర్థులు పెరగడం అనుమానాలకు ఆస్కారమిస్తోంది. నామినల్‌ రోల్స్‌ తనిఖీలోనూ సరైన పద్ధతి లేదు. ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేయాలి. కమిషన్‌ ఒక్కరితోనే సరిపెట్టింది. అభ్యర్థుల హాజరు నమోదుకూ ఓ విధానమంటూ లేదు. ఆరోపణలు వచ్చినపుడు అవకతవకలు జరిగి ఉండవచ్చనడానికి చాలా అవకాశాలున్నాయి’’ అని వ్యాఖ్యానించింది.

పరీక్ష రద్దు చేస్తే 2 లక్షల మంది అభ్యర్థులకు నష్టం: ఏజీ

పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని, ఒక్క ఆరోపణా లేదని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. కేవలం ముగ్గురు పిటిషనర్లు మాత్రమే ఊహాజనిత అంశాలతో కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘ఒకవేళ బయోమెట్రిక్‌ మినహాయించాలనుకుంటే అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసి ఉండాల్సిందని, అప్పుడు ఎవరూ ప్రశ్నించి ఉండేవారు కాదని’ వ్యాఖ్యానించింది. ఏజీ సమాధానమిస్తూ కమిషన్‌ రాజ్యాంగ సంస్థ అని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. పరీక్షను రద్దు చేస్తే 2 లక్షల మంది అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందన్నారు. మరోసారి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ బయోమెట్రిక్‌ అమలు చేయవద్దని నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగ సంస్థ ముందు ఏం సమాచారం ఉందని నిలదీసింది.

ఆ 258 మంది ఎవరు?

గ్రూప్‌-1 పరీక్ష జూన్‌ 11న నిర్వహించినపుడు హాజరైనవారి సంఖ్య తొలుత 2,33,248 మందిగా వెల్లడించారని, 17 రోజుల తరువాత 2,33,506 మందిగా పేర్కొన్నారని, అదనంగా వచ్చిన 258 మంది ఎవరని అభ్యర్థుల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.గిరిధర్‌రావు ప్రశ్నించారు. మొదటిది ప్రాథమిక సమాచారమని చెప్పడం తప్ప స్పష్టమైన వివరణ లేదన్నారు. అక్టోబరులో నిర్వహించినపుడు బయోమెట్రిక్‌ అవలంబించారని, అప్పుడు ఇలాంటి తేడా లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం బయోమెట్రిక్‌ విధానం అమలు చేయకపోవడం, వెబ్‌నోట్‌ ప్రకారం అభ్యర్థుల సంఖ్య పెరగడం, నామినల్‌ రోల్స్‌లో ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేయకపోవడం తదితర అంశాలతో అవకతవకలకు అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల పరీక్షను రద్దు చేస్తూ, నోటిఫికేషన్‌లోని నిబంధనల ప్రకారం తిరిగి నిర్వహించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సమర్థనీయమేనని పేర్కొంటూ కమిషన్‌ అప్పీలును కొట్టివేసింది.


తంలో అనుసరించిన బయోమెట్రిక్‌ విధానాన్ని టీఎస్‌పీఎస్సీ రెండోసారి మినహాయించింది. దీనివల్ల ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసి ఉండే అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోనూవచ్చు. అనుమానాలకైతే ఆస్కారముంది. గతంలో 2,85,916 మంది హాజరైనపుడు తీసుకున్న బయోమెట్రిక్‌ను 2,33,506 మంది హాజరైనపుడు ఎందుకు తీసుకోలేకపోయింది?


యోమెట్రిక్‌ అమలు చేయడంలేదంటూ గ్రూప్‌-4 పరీక్షలకు అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లుగా ఇక్కడ చేయకపోవడం సరికాదు. నోటిఫికేషన్‌లో ఉన్న సూచనలకు కమిషన్‌, అభ్యర్థులు కట్టుబడి ఉండాల్సిందేనని తమిళనాడు వర్సెస్‌ హేమలత కేసులో సుప్రీంకోర్టు తీర్పును సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. అది సరైన నిర్ణయమే.

హైకోర్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని