సింగరేణిలో ఎన్నికల సైరన్‌

సింగరేణి కాలరీస్‌ సంస్థలో ఎన్నికల సైరన్‌ మోగింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వచ్చే నెల 28న నిర్వహించేందుకు.. ఎన్నికల అధికారి, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు బుధవారం షెడ్యూలు విడుదల చేశారు.

Published : 28 Sep 2023 06:05 IST

వచ్చే నెల 28న గుర్తింపు సంఘం ఎన్నికలు
అదే రోజు ఫలితాల వెల్లడి
షెడ్యూలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌- కొత్తగూడెం, సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణి కాలరీస్‌ సంస్థలో ఎన్నికల సైరన్‌ మోగింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వచ్చే నెల 28న నిర్వహించేందుకు.. ఎన్నికల అధికారి, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు బుధవారం షెడ్యూలు విడుదల చేశారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 30న కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి అందజేస్తారు.  వాటిపై వచ్చే నెల 3 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 5న ఓటర్ల తుది జాబితా ప్రదర్శిస్తారు. వచ్చే నెల 6వ తేదీ ఉదయం 10 నుంచి 7వ తేదీ సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9న ఉ. 10 నుంచి సా.5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులకు 10వ తేదీ మధ్యాహ్నం ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

అయినా.. ఎన్నికలు జరిగేనా?: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూలు విడుదలైనా ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో వచ్చే నెల మొదటి వారంలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఈ పనిలో తలమునకలై ఉంది. 42 వేలకు పైగా ఓటర్లున్న సింగరేణిలో ఎన్నికలకు భారీ బందోబస్తుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సేవలు అవసరం. ఈ క్రమంలో సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలు సింగరేణి ఎన్నికలలో పాల్గొనలేమని ఎన్నికల అధికారికి వెల్లడించారు. మరోవైపు కార్మిక సంఘాల్లో అధికశాతం ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని సంస్థలోని 13 యూనియన్లు లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారి శ్రీనివాసులును కోరాయి. అలానే గెలిచిన సంఘం కాలపరిమితి, గత ఒప్పందాల అమలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి.  వీటితోపాటు ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉంది. సింగరేణిలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 20కి పైగా మైనింగ్‌ సంస్థల బృందాలు రానున్నాయి. 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధం అవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా షెడ్యూలు విడుదల చేశారని సంఘాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు