టెట్‌ పేపర్‌-2లో 15 శాతమే పాస్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. టెట్‌ నిర్వహణ మొదలైన 2011 నుంచి పేపర్‌-2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది.

Updated : 28 Sep 2023 07:00 IST

పరీక్ష నిర్వహణ ప్రారంభమయ్యాక ఇదే అత్యల్ప ఉత్తీర్ణత
పేపర్‌-1లో 36.89 శాతం పాస్‌
సందేహాలకు తావిస్తున్న ఫలితాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. టెట్‌ నిర్వహణ మొదలైన 2011 నుంచి పేపర్‌-2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. ఆ పేపర్‌లో కేవలం 15.30 శాతం మందే కనీస మార్కులు పొంది అర్హత సాధించారు. పేపర్‌-1లో గతేడాది కంటే నాలుగు శాతం ఉత్తీర్ణత పెరిగినా అంతకు ముందు జరిగిన ఆరు పరీక్షలతో పోల్చుకుంటే మాత్రం బాగా తగ్గిపోయింది. ఈ నెల 15వ తేదీన టెట్‌ నిర్వహించగా...ఫలితాలను పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించింది. పేపర్‌-1లో 82,489 మంది, పేపర్‌-2లో 29,073 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష జరిగిన నాడే పేపర్‌-2 ప్రశ్నపత్రం కఠినంగా ఉందని, పేపర్‌-1 మాత్రం సులభంగా ఉందని కొందరు అభ్యర్థులు తెలిపారు. ఆ ప్రకారమే ఉత్తీర్ణత శాతం వచ్చింది. గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్‌ అధ్యాపకులు తదితర పరీక్షలకూ అభ్యర్థులు సన్నద్ధమవడంతో టెట్‌లో ఉత్తీర్ణత తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. టెట్‌లో వచ్చిన మార్కులకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ)లో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అందుకోసమే అధిక శాతం అభ్యర్థులు టెట్‌ పరీక్ష రాస్తున్నారు.

జిల్లాల వారీగా ఇప్పుడెందుకు ప్రకటించలేదు..

ఈ నెల 15న పరీక్ష జరగగా..పేపర్‌-1కు 2,22,744 మంది, పేపర్‌-2కు 1,89,963 మంది హాజరైనట్లు అధికారికంగా టెట్‌ కన్వీనర్‌ ప్రకటించారు. బుధవారం మాత్రం పేపర్‌-1కు 2,23,582 మంది, పేపర్‌-2కు 1,90,047 మంది హాజరైనట్లు వెల్లడించారు. అంటే పేపర్‌-1కు 838 మంది తగ్గారు. పేపర్‌-2లో 84 మంది పెరిగినట్లు చూపారు. ఇది ఎందుకు జరిగిందనే విషయాన్ని అధికారులు వెల్లడించకపోవడం సందేహాలకు తావిస్తోంది.  ఉదయం 10 గంటలకు ఫలితాలను వెబ్‌సైట్లో పెట్టిన అధికారులు మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉత్తీర్ణత శాతం వెల్లడించకపోవడం గమనార్హం. జిల్లాల వారీగా, సామాజిక వర్గాలు, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం వివరాలను ఇచ్చేందుకు నిరాకరించారు. పరీక్ష జరిగిన నాడు జిల్లాల వారీగా అభ్యర్థులు, హాజరు శాతాన్ని ప్రకటించిన అధికారులు ఇప్పుడు మాత్రం ససేమిరా అంటుండడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని