చట్టవిరుద్ధమైన అరెస్ట్‌ చెల్లదు

ఏదైన కేసులో నిందితులను అరెస్ట్‌ చేసే ముందు చట్టపర నిబంధనలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బుధవారం హైకోర్టు స్పష్టంచేసింది.

Published : 28 Sep 2023 04:15 IST

ఎన్‌ఐఏ తీరును తప్పుబట్టిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఏదైన కేసులో నిందితులను అరెస్ట్‌ చేసే ముందు చట్టపర నిబంధనలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బుధవారం హైకోర్టు స్పష్టంచేసింది. అక్రమంగా అరెస్ట్‌ చేసిన దుబాసి దేవేందర్‌ను విడుదల చేయాలంటూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌ జిల్లా జైలు సూపరింటెండెంట్‌, ఎన్‌ఐఏ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో పరీక్షలకు హాజరవుతున్న తన భర్త దేవేందర్‌ను ఎన్‌ఐఏ అధికారులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పసుమాములకు చెందిన స్వప్న హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ కె.సుజనల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ భర్తను సివిల్‌ డ్రస్‌లో ఉన్న వ్యక్తులు తీసుకెళ్లి ములుగు స్టేషన్‌లో నిర్బంధించారన్నారు. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ తీసుకెళ్లారని, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దేవేందర్‌పై బస్తర్‌ జిల్లాలో 2019లో నమోదైన కేసులో 41ఎ కింద నోటీసులు జారీ చేసి చట్టబద్ధంగా కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి, ఇతర సంస్థలకు కొరియర్‌గా పనిచేశారన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని, జగదల్‌పూర్‌ జైలులో రిమాండ్‌పై ఉన్నారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఎన్‌ఐఏ జారీ చేసిన 41ఎ నోటీసు జారీలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది. నోటీసులో విజయవాడ ఎన్‌ఐఏ క్యాంపు ఆఫీసు చిరునామా చూపారని, పిటిషనర్‌ భర్తను సిద్దిపేటలో నిర్బంధంలోకి తీసుకున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది.అరెస్ట్‌లో చట్ట ఉల్లంఘనలు ఉన్నందున పిటిషనర్‌ భర్తను విడుదల చేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని