ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకం

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులను నియమించినట్లు ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది.

Published : 28 Sep 2023 04:15 IST

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులను నియమించినట్లు ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌తో పాటు అయిదుగురు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చామని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త గణేష్‌రావు, మరొకరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది ముజీబ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఇటీవల  నియామకాలు పూర్తి చేశామన్నారు. ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు వ్యాజ్యంపై విచారణ

ఎస్టీల కోసం కమిషన్‌ ఏర్పాటు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని బుధవారం హైకోర్టు ఆదేశించింది. ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ లంబాడీ హక్కుల పోరాట సమితి నగర భేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూక్యా దేవా నాయక్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా బుధవారం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది బూక్యా మంగ్లీలాల్‌ నాయక్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది పి.రాంప్రసాద్‌ కౌంటరు దాఖలు చేయడానికి 4 వారాల గడువు కావాలనడంతో ధర్మాసనం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని