యాసంగి సాగుకు ఇప్పటి నుంచే సన్నద్ధత

యాసంగి పంటల సాగుకోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. యాసంగిలో సుమారు 75-80 లక్షల ఎకరాల్లో  పంటలు సాగవుతాయని,  అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు.

Published : 28 Sep 2023 04:15 IST

విత్తనాలు, ఎరువులు  అందుబాటులోకి తేవాలి
వానాకాలం సీజన్‌లో రికార్డుస్థాయిలో వరి
యాసంగికి పెరిగే అవకాశం
సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు,హైదరాబాద్‌: యాసంగి పంటల సాగుకోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. యాసంగిలో సుమారు 75-80 లక్షల ఎకరాల్లో  పంటలు సాగవుతాయని,  అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. వానాకాలం సీజన్‌లో  ఇప్పటివరకు కోటి 26 లక్షల ఎకరాల్లో పంటలను వేయగా.. అత్యధికంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డని మంత్రి పేర్కొన్నారు. మరో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేశారన్నారు. వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్ధత, రుణమాఫీ అమలు, ఆయిల్‌పామ్‌ సాగుపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘‘వానాకాలం సీజన్‌ వరి అంచనాకు మించి సాగయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే గతంలోకన్నా 24వేల ఎకరాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. సిద్దిపేట, సంగారెడ్డి, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో గతంలోకన్నా పెరిగింది. గత  యాసంగిలో 74 లక్షల ఎకరాల్లో సాగయింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉంది. రబీ కోసం 9.8 లక్షల టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి నివేదిస్తే 9.2 లక్షల టన్నులే కేటాయించారు’’ అని మంత్రి పేర్కొన్నారు.

కొనసాగుతున్న రుణమాఫీ...

అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తిచేస్తామని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఇప్పటివరకు 21,34,949 రైతులకు రూ.11,812.14 కోట్లు మాఫీ అయ్యాయి.   అర్హుల రుణాలన్నీ మాఫీ చేస్తాం. రుణమాఫీ సందేహాల నివృత్తికి రాష్ట్రస్థాయిలో 040 23243667 నంబరులో సంప్రదించాలి. పెండింగ్‌లో ఉన్న రైతుబీమా క్లెయిములన్నీ వేగంగా పరిష్కరిస్తాం’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ప్రత్యేక కమిషనర్‌ హన్మంతు తదితరులు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు