కేసీఆర్‌.. సింగరేణి పక్షపాతి

సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ పక్షపాతి అని, సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

Published : 28 Sep 2023 04:15 IST

భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఈనాడు,హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ పక్షపాతి అని, సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఆయన తిప్పికొట్టి సంస్థకు, కార్మికులకు అండగా నిలుస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు లాభాల్లో 32 శాతం వాటా ఇవ్వాలని సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి,  కార్యనిర్వాహక అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ఇతర నేతలు బుధవారం కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్‌ ఎప్పడూ మరచిపోబోరని అన్నారు. కార్మికులకు అత్యధిక బోనస్‌ ప్రకటించిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని, 2014లో 18 శాతం బోనస్‌ ఉండగా.... 2022 నాటికి 30 శాతానికి పెంచామని, ఈ సారి 32 శాతానికి పెరగడం చరిత్రాత్మకమన్నారు.

భారాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల, ఇతర నేతలు మహేష్‌  తన్నీరు, చందు తల్లా, హరీశ్‌రెడ్డి, సురేశ్‌లు బుధవారం కవితను ఆమె నివాసంలో కలిసి మహిళా బిల్లు సాధనకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  మహిళా బిల్లులో ఓబీసీ మహిళల వాటా కోసం ఆమె కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని