భద్రాద్రి అన్నదాన సత్రంలో ఒకేసారి వెయ్యిమంది భోజనానికి ఏర్పాట్లు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అన్నదాన సత్రంలో ఒకే దఫా వెయ్యిమంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.

Updated : 03 Oct 2023 04:44 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అన్నదాన సత్రంలో ఒకే దఫా వెయ్యిమంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. దాతల సహకారంతో వచ్చే శ్రీరామ నవమికల్లా అవసరమైన మార్పులు చేపట్టి రామాలయ అభివృద్ధే కర్తవ్యంగా పనిచేస్తామన్నారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా దాతలకు సామూహిక సన్మానాలను స్థానిక తితిదే సత్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. పూర్వం నుంచి ఇంతవరకు రూ.లక్ష పైబడి వస్తు, వస్త్ర, ఆభరణ, వాహన, అన్నదాన, వసతి సదుపాయం నిమిత్తం విరాళాలు ఇచ్చిన దాతలు 900 మంది ఉండగా వీరందరికీ సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా దాతల్లో 250 మందికి పైగా తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌ నేతృత్వంలో వేదాశీర్వచనం పలికారు. స్వామివారి ప్రసాదంగా చిత్రపటం, పులిహోర, బెల్లం పొంగలి, రాగిమాడ, తలంబ్రాల ప్యాకెట్‌, 100 గ్రాముల లడ్డూలు రెండు, కండువా, జాకెట్టు పీసు, భోజన సదుపాయం కల్పించారు.ఇంతవరకు చేపట్టిన అభివృద్ధితో పాటు చేయాల్సిన పనుల గురించి ఈవో వివరించారు. అన్ని రకాల పూజలు, సేవలు, దర్శనాల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దాతలు నిర్మించిన సత్రాలను ప్రైవేటు వ్యక్తుల పర్యవేక్షణ నుంచి తప్పించి స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పారు. విరాళంగా వచ్చిన భూములను, ఆస్తులను రక్షించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు వివరించారు. ఏఈవోలు శ్రావణ్‌కుమార్‌, ఎస్‌.భవాని రామకృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని