‘డబ్బు’ కట్టడి... ‘బోగస్‌’పై దృష్టి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం తెర తీయనుంది. తెలంగాణతోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాలకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

Published : 03 Oct 2023 02:58 IST

నేటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులు పర్యటన
ఎన్నికల సన్నద్ధతపై విస్తృత స్థాయి సమీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం తెర తీయనుంది. తెలంగాణతోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాలకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల పర్యటనల్లో భాగంగా ఎన్నికల సంఘం మంగళవారం నుంచి గురువారం వరకు తెలంగాణలో పర్యటించనుంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధతను నిర్ధారించుకోనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో 17 మందితో కూడిన ఉన్నతస్థాయి బృందం... రాష్ట్ర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో మూడు రోజులపాటు విస్తృతంగా చర్చించనుంది. కొందరు అధికారులు సోమవారమే హైదరాబాద్‌ చేరుకున్నారు. మరికొందరు మంగళవారం ఉదయం వస్తారు. రాష్ట్రాల్లో పర్యటనలు ముగిశాక దిల్లీలో ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.

రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు

ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో సుమారు రూ.వంద కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో ఆ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను ఎన్నికల సంఘం ఇప్పటికే రంగంలోకి దింపింది. అవి భారీగా డబ్బు వెచ్చించే అవకాశమున్న నియోజకవర్గాల గుర్తింపు పనిలో ఉన్నట్లు సమాచారం. డబ్బు నియంత్రణకు ఏజెన్సీలు అమలు చేయనున్న వ్యూహాలపై సవివరంగా సమీక్షించాలని సీఈసీ నిర్ణయించింది.

బోగస్‌ ఓట్ల తొలగింపుపైనా...: ఓటర్ల జాబితా ప్రక్షాళనకు తీసుకున్న చర్యలపైనా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సమీక్షించనుంది. బోగస్‌ ఓటర్ల ఏరివేత, ఒకే ఇంటి నంబరుతో పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లను గుర్తించడంలో అనుసరించిన విధానంపైనా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని రాబట్టనుంది. ఓట్ల తొలగింపు విషయంలో అధికారులు జారీ చేసిన నోటీసులు అస్తవ్యస్తంగా ఉన్నట్లు సీఈసీకి ఫిర్యాదులు అందాయి. దశాబ్దాలుగా ఒకే ఇంటి నంబరులో నివసిస్తున్న వారికి కూడా మీ ఓటు తొలగించనున్నట్లు నోటీసులు జారీ చేయడం హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

ఏమేం చేస్తారంటే...

  • మంగళవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతుంది. సాయంత్రం 5 నుంచి 6.30 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 20 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల ఉన్నతాధికారులతో ఎన్నికల్లో డబ్బును కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షిస్తుంది. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, రాష్ట్ర స్థాయి పోలీసు నోడల్‌ అధికారి, సీఆర్పీఎఫ్‌ అధికారులు... ఎన్నికల వ్యవహారాలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు.
  • బుధవారం ఉదయం 6.30కి దుర్గం చెరువు తీగల వంతెన వద్ద ఓటరు చైతన్యం కోసం సైకిల్‌థాన్‌, వాక్‌థాన్‌లను ఎన్నికల సంఘం ప్రారంభిస్తుంది. 9.30  నుంచి రాత్రి 7.30 గంటల వరకు 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఓటర్ల జాబితా, పోలింగు కేంద్రాలు, బందోబస్తుపై జిల్లాల వారీగా సమీక్షిస్తుంది.
  • గురువారం ఉదయం 9.15 నుంచి 10 వరకు గచ్చిబౌలిలోని టెక్‌మహీంద్రా ఆడిటోరియంలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల ఎగ్జిబిషన్‌ను తిలకించి, రాష్ట్ర స్థాయిలో ఓటరు ప్రభావశీలురు, యువ, దివ్యాంగ ఓటర్లను ఎన్నికల అధికారులు కలుస్తారు. ఉదయం 11-12 గంటల వరకు సీఎస్‌, డీజీపీలతో సమావేశం అవుతుంది. సాయంత్రం   తరవాత అధికారుల బృందం దిల్లీ బయలుదేరి వెళుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు