ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు: కేటీఆర్‌

రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకం ఇస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Updated : 03 Oct 2023 05:47 IST

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌, సూర్యాపేట: రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకం ఇస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర సచివాలయం సమీపంలోని 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జలమండలి ఆధ్వర్యంలో దళిత డ్రైవర్లకు మురుగు వ్యర్థ రవాణా వాహనాలను అందజేశారు. దేశంలోనే తొలిసారిగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని, స్వాంతంత్య్రం వచ్చిన తర్వాత ఏ పాలకులూ దళితుల బాగు కోసం ఇంతలా ఆలోచించలేదన్నారు. దళితులు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ దీనికి శ్రీకారం చుట్టారని, ఈ పథకం కింద రూ.10 లక్షలు పొందిన కుటుంబాలన్నీ ఆర్థికంగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 76 వేల దళిత కుటుంబాలుండగా 9వేల కుటుంబాలకు మాత్రమే పథకం అందిందని, మిగిలిన వారికీ దశలవారీగా అందజేస్తామన్నారు. మురుగు వ్యర్థాల రవాణాకు జలమండలి అధికారులు రూపొందించిన వాహనాలు కొత్త ప్రయోగమని, తరలించేటప్పుడు రోడ్లపై వ్యర్థాలు పడబోవని వివరించారు. డ్రైవర్‌కు ఇద్దరు సహాయకులుంటారని, వీరికి ఏకరూప దుస్తులు, శిరస్త్రాణంతోపాటు రూ.3 వేల విలువైన భద్రత పరికరాలను జలమండలి ఇస్తోందని వివరించారు. వాహనాల నిర్వహణకు ఏటా రూ.23.33 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు.

నాలుగు జిల్లాల లబ్ధిదారులు... 162 వాహనాలు

మురుగునీటి వ్యర్థాల రవాణా (సిల్ట్‌ కార్టింగ్‌) వాహనాల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 162 మంది డ్రైవర్లను దళితబంధు కింద ఎంపిక చేశారు. మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసినప్పుడు వ్యర్థాలను ఇకపై రోడ్డుపైనే వదిలేయకుండా ఈ వాహనాల్లో తరలిస్తారు. చెత్త, మురుగు వ్యర్థాలను తొలగించి, తరలించేందుకు నెలకు అద్దె ఛార్జీలు, కార్మికుల జీతం, నిర్వహణ ఖర్చులను జలమండలి చెల్లిస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠాగోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, పాషాఖాద్రీ, ప్రకాశ్‌గౌడ్‌, బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌, ఐఏఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జా, ఉపమేయర్‌ మోతె శ్రీలత, బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్ని ప్రారంభించేముందు మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు మంత్రులు పుష్పాంజలి ఘటించారు.

సూర్యాపేటలో ఐటీటవర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభ ముగిసిన అనంతరం... మంత్రి కేటీఆర్‌ ఆరుగురు లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను, 18 మందికి దళితబంధు పథకం చెక్కులను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు