గాంధీజీ బాటలో పోరాటానికి వెనకాడొద్దు

గాంధీజీ ఎంచుకున్న పోరాట మార్గాలు ఎప్పటికీ ఆచరణీయమేనని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ అభిప్రాయపడ్డారు.

Published : 03 Oct 2023 02:58 IST

మెరుగైన సమాజానికి అది అవశ్యం
‘మంథన్‌ సంవాద్‌’ కార్యక్రమంలో జస్టిస్‌ మురళీధర్‌
విద్యాస్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్న ప్రొఫెసర్‌ నీరజాగోపాల్‌
ప్రభుత్వాల జోక్యం తరగతి గది వరకూ వచ్చిందని ఆందోళన

ఈనాడు హైదరాబాద్‌: గాంధీజీ ఎంచుకున్న పోరాట మార్గాలు ఎప్పటికీ ఆచరణీయమేనని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ అభిప్రాయపడ్డారు. మహాత్ముడు చూపిన తెగువ, ధైర్యం, అహింస, సహాయ నిరాకరణ ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. గాంధీజీ అనుసరించిన మార్గాలైన నిరసన తెలపడం, నిర్భయంగా మాట్లాడటం, అభిప్రాయం చెప్పడం వంటివి ప్రజాస్వామ్యం రూపాంతరం చెందడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. నిరసన తెలపడానికి, మాట్లాడటానికి భయపడే వారు గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. మెరుగైన సమాజం కోసం మహాత్ముడు చూపిన మార్గంలో పోరాడటాన్ని ఆపొద్దని పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మంథన్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘మంథన్‌ సంవాద్‌’ కార్యక్రమంలో ‘న్యాయవాదిగా గాంధీ’ అనే అంశంపై జస్టిస్‌ మురళీధర్‌ ప్రసంగించారు. ‘‘గాంధీజీ ప్రతి అవకాశాన్ని రాజకీయ పోరాటం కోసం వినియోగించారు. ఆ పోరాటంలో కుటుంబపరంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ, ఆయన చేసిన పోరాటం మానవ జాతికి ఎంతగానో ఉపయోగపడింది. ఆయన చూపిన అహింసా పోరాట మార్గం నెల్సన్‌ మండేలా, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, ఆంగ్‌సాన్‌ సూకీ.. ఇలా ఎంతో మందికి ఆదర్శప్రాయమైంది. మన దేశంలో ఇరోమ్‌ షర్మిల పదేళ్లపాటు చేసిన పోరాటం, రైతు ఉద్యమాలు, షహీన్‌బాగ్‌ ఆందోళన, స్టాన్‌ స్వామి మౌనంగా బాధను భరించడం ఇలాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. గాంధీజీ న్యాయవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా తన ప్రస్థానంలోని ప్రతి అంశాన్ని అక్షరబద్ధం చేశారు. బలహీనతల గురించి చెప్పుకోవడానికీ వెనకాడలేదు. ఈతరం న్యాయవాదులు ఆయన్నుంచి అనేక అంశాలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని సూచించారు.

న్యాయమూర్తులూ సమాజం నుంచి వచ్చిన వారే

న్యాయవ్యవస్థ గతంలో కంటే ఏమీ మారలేదని జస్టిస్‌ మురళీధర్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు  వచ్చేది కూడా బార్‌ నుంచేనని, మొత్తం సమాజంలో వచ్చిన మార్పులో భాగంగానే దీన్నీ చూడాల్సి ఉంటుందన్నారు. బార్‌ అసోసియేషన్‌లోనూ ఓ కారణం కోసం నిలబడే న్యాయవాదులున్నారని, హైదరాబాద్‌లో కేజీ కన్నబిరాన్‌ ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ‘ప్రస్తుతం మంచి న్యాయమూర్తులు ఉన్నారు. మంచి న్యాయవాదులూ ఉన్నారు. సమాజానికి కావాల్సింది మాత్రం మొత్తం సమాజంలో మార్పు’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ హిందీ కవి సంపత్‌ సరాల్‌ సమకాలీన రాజకీయ, సాంఘిక పరిణామాలపై చలోక్తులు విసురుతూ హాస్యాన్ని పంచారు. ది న్యూస్‌ మినిట్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ధన్యా రాజేంద్రన్‌ మాట్లాడుతూ, ఉత్తమ జర్నలిజానికి ఉత్తమ వనరులూ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా సమాజ పరిణామాలను నిమిషాల్లో ప్రజల వద్దకు చేరుస్తుండటం ప్రధాన స్రవంతి పాత్రికేయులకు సవాల్‌గా మారిందన్నారు. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ సహ వ్యవస్థాపకులు సేన్‌ గుప్తా, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనాథ్‌ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చందనా చక్రవర్తి సమన్వయకర్తగా వ్యవహరించగా, విక్రమ్‌, కిన్నెరమూర్తిలు మంథన్‌ కార్యక్రమాల గురించి వివరించారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వేణుగోపాల్‌రెడ్డి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, ఎన్‌.ఐ.ఆర్‌.డి మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డబ్ల్యు.ఆర్‌.రెడ్డి, ఐఎఎస్‌ అధికారులు రఘునందనరావు, వాకాటి కరుణ, విద్యావేత్త ప్రొఫెసర్‌ శాంతాసిన్హా, ఈపీడబ్ల్యూ మాజీ సంపాదకులు రామమనోహర్‌రెడ్డితోపాటు పలువురు ప్రొఫెసర్లు, న్యాయవాదులు హాజరయ్యారు.


విద్యారంగంపై దాడి

ప్రొఫెసర్‌ నీరజాగోపాల్‌ జయల్‌

యా జాతీయవాద విధానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులతో ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా స్వేచ్ఛ(అకడమిక్‌ ఫ్రీడం) ప్రమాదంలో పడిందని లండన్‌లోని కింగ్స్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ నీరజాగోపాల్‌ జయల్‌ అభిప్రాయపడ్డారు. ‘విద్యా స్వేచ్ఛ’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. ‘‘నయా ఆర్థిక విధానాలకు తోడు నయా జాతీయవాదం ముందుకొచ్చిన తర్వాత విద్యారంగం అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించింది. పరిశోధన, పాఠ్య ప్రణాళిక..ఇలా అన్నీ ప్రమాదంలో పడ్డాయి. విశ్వవిద్యాలయాల్లో ఏ అంశం గురించీ స్వేచ్ఛగా చర్చించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వాల జోక్యం తరగతి గది వరకూ వచ్చింది. నియామకాలు, బోధన, పరిశోధన ఇలా అన్నింటిలో సిద్ధాంతపరమైన జోక్యం పెరిగింది. 2022 సెప్టెంబరు నుంచి 2023 సెప్టెంబరు వరకు విద్యా స్వేచ్ఛకు సంబంధించిన ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగా 243 జరిగితే, అందులో 37 భారతదేశంలోనివే. ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగిన ఇరాన్‌(48) తర్వాతి స్థానంలో మనం ఉన్నామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఏ పుస్తకాలు ప్రచురించాలో, ఏవి ప్రచురించకూడదో, ఏ సదస్సు నిర్వహించాలో, ఏది నిర్వహించకూడదో ప్రభుత్వాలే చెబుతున్నాయి. చివరకు గ్రంథాలయంలో ఉన్న ఓ పుస్తకం గురించి ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేశారు. తాను  ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించక మునుపు నుంచే ఆ పుస్తకం అక్కడ ఉందని ఆ ప్రిన్సిపల్‌ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. విద్యారంగంపై జరుగుతున్న ఇలాంటి దాడి వల్ల ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులే’’ అని నీరజాగోపాల్‌ జయల్‌ ఆవేదన వ్యక్తంచేశారు.


పథకాల అమలులో పౌరుల భాగస్వామ్యం లేదు

-యామినీ అయ్యర్‌

విద్య, వైద్యం, పౌష్టికాహారం లాంటి ప్రాథమిక అంశాలకు అవసరమైన నిధులు ఇవ్వని ప్రభుత్వాలు ఓటర్లతో నేరుగా సంబంధాల కోసం నగదు బదిలీ కార్యక్రమాలు అమలుచేస్తున్నాయని సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చి(దిల్లీ) ప్రెసిడెంట్‌ యామిని అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. ‘భారతదేశం-సంక్షేమ రాజ్యం’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. ‘‘బటన్‌ నొక్కితే లబ్ధిదారులకు నగదు చేరే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మధ్యలో వాళ్లతో సంబంధం లేకుండా నేరుగా నాయకులే ఓటర్లతో సంబంధాలు కలిగి ఉండటానికి అవకాశం ఏర్పడింది. పథకాల అమలులో పౌరుల చురుకైన భాగస్వామ్యం లేకుండా పోయింది. లబ్ధిదారుడిని నేతలే ఎంపిక చేసే పరిస్థితి రావడంతో అనేక మందిని ఈ జాబితా నుంచి తప్పించడానికి అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రాంతీయ పార్టీలున్న అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. భారత దేశంలో వృద్ధిరేటు బాగా ఉందని పాలకులు చెప్తున్నా, దానికి తగ్గట్లుగా ఉద్యోగాలు మాత్రం లేవు. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా కార్మిక చట్టాలు బలహీనపడ్డాయి. అంతిమంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది’’ అని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు