విజయ డెయిరీ విస్తరణ!

రాష్ట్ర ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా డెయిరీ కార్యకలాపాలు పెద్దఎత్తున విస్తరిస్తున్నా హైదరాబాద్‌ కేంద్రంగానే కొనసాగుతున్నాయి.

Published : 03 Oct 2023 02:58 IST

కొత్తగా 6 జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా డెయిరీ కార్యకలాపాలు పెద్దఎత్తున విస్తరిస్తున్నా హైదరాబాద్‌ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. పాల సేకరణ తర్వాత హైదరాబాద్‌కు రవాణా చేయడం, ఉత్పత్తుల తయారీ అనంతరం తిరిగి జిల్లాలకు పంపడం చేస్తున్నారు. దీంతో రవాణా, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డెయిరీ కార్యకలాపాలను ఆరు జోన్లుగా విభజించి, వికేంద్రీకరణ విధానంలో సాగాలని భావిస్తోంది. తద్వారా పాల సేకరణ నుంచి ఉత్పత్తుల తయారీ వరకూ డెయిరీ సామర్థ్యాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 64 ఉన్న విజయ డెయిరీ దుకాణాలు (అవుట్‌లెట్లు, పార్లర్లు) ఇప్పుడు 650కి పెరిగాయి. వీటిని వెయ్యికి పెంచాలని భావిస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇటీవల సమీక్ష నిర్వహించి విస్తరణ ప్రతిపాదనలపై చర్చించారు. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌లలో కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జోన్‌ల కేంద్రంగా పాల సేకరణ చేపడతారు. అక్కడే ఉత్పత్తి యూనిట్లు ప్రారంభిస్తారు. జోన్‌ల ఆధ్వర్యంలో మార్కెటింగ్‌ చేపడతారు.  

త్వరలో మెగా డెయిరీ ప్లాంటు: రోజుకు 5-8 లక్షల లీటర్ల ప్రాసెసింగ్‌ సామర్థ్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 42 ఎకరాల్లో రూ.250 కోట్లతో విజయ డెయిరీ మెగా ప్లాంటును నిర్మిస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే విస్తరణ ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు. విజయ డెయిరీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పాల సహకార సంఘాల ద్వారా 4.5 లక్షల లీటర్లు సేకరిస్తోంది. పాలతో పాటు పాల ఆధారిత వివిధ ఉత్పత్తులను తయారుచేసి సొంత దుకాణాల ద్వారా విక్రయిస్తోంది. కొత్తగా విజయ ఐస్‌క్రీమ్‌ తయారీకి సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు