ఐటీ వృద్ధిలో బెంగళూరును దాటేశాం

ఐటీ వృద్ధిలో బెంగళూరును దాటేశామని, తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Updated : 03 Oct 2023 05:38 IST

మాది గాంధీ వారసత్వమైతే... భాజపాది గాడ్సే వారసత్వం
కాంగ్రెస్‌ను నమ్మితే రైతన్నల జీవితం అంధకారమే
సేద్యంతోపాటు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాం
సూర్యాపేట, నల్గొండల్లో ఐటీ టవర్ల ప్రారంభోత్సవాల్లో మంత్రి కేటీఆర్‌
మలక్‌పేటలో 21 అంతస్తుల ఐటీ టవర్‌కూ శంకుస్థాపన

ఈనాడు, హైదరాబాద్‌, నల్గొండ: ఐటీ వృద్ధిలో బెంగళూరును దాటేశామని, తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, రుణమాఫీపై కేసీఆర్‌ మాట తప్పడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమన్నారు. కరోనాతో రెండేళ్లపాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా... రూ.37 వేల కోట్లతో సీఎం కేసీఆర్‌ రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. మత పంచాయితీలు తప్పితే దేశానికి భాజపా చేసిందేమీ లేదని, మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించి అవమానిస్తున్నారన్నారు. భారాస స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలో, ఎంఐఎం స్టీరింగ్‌ అసదుద్దీన్‌ చేతిలో ఉంటే... భాజపా స్టీరింగ్‌ మాత్రం ప్రధాని చేతిలో కాకుండా అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. నల్లధనం తెస్తానని చెప్పి మోదీ తెల్లమొహం వేశారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌ మలక్‌పేట్‌లో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ పార్కుకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సూర్యాపేట, నల్గొండల్లోనూ ఐటీ టవర్లను ప్రారంభించారు. సూర్యాపేటలో రూ.530 కోట్లు, నల్గొండలో రూ.912.33 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ చేనేత మగ్గం పథకం ప్రారంభించి క్లస్టర్‌ మగ్గాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌

మలక్‌పేటలో కేటీఆర్‌ మాట్లాడుతూ... ‘‘సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వివిధ అంశాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌, హరియాణాలను అధిగమించాం. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారింది. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి 33% ఉండగా ప్రస్తుతం 44 శాతానికి పెరిగి బెంగళూరును దాటేశాం. గతంలో నగరంలో తరచూ కర్ఫ్యూలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి మారింది. గణేశ్‌ నిమజ్జనం కోసం మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీని ముస్లిం సోదరులు వాయిదా వేసుకోవడం ఐక్యతకు నిదర్శనం. మలక్‌పేటలో ఐటీ టవర్‌ కోసం 44.20 ఎకరాలు కేటాయించాం. మొదటివిడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో 21 అంతస్తుల్లో టవర్‌ను నిర్మిస్తాం. దీన్ని 36 నెలల్లో పూర్తి చేస్తాం. మలక్‌పేట అంటే టీవీ టవర్‌. ఇకపై ఐటీ టవర్‌గా మారుతుంది. హైటెక్‌సిటీ తరహాలో మెట్రోస్టేషన్‌ నుంచి ఐటీటవర్‌ వరకు స్కైవాక్‌ నిర్మిస్తాం’’ అని హామీ ఇచ్చారు. అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ... మలక్‌పేటలో ఐటీటవర్‌ ఏర్పాటులో మంత్రి కేటీఆర్‌ పాత్ర ఎంతో కీలకమన్నారు. పాతబస్తీ నుంచి నిత్యం 8-10 వేల మంది హైటెక్‌సిటీకి వెళ్తున్నారన్నారు. బ్లాక్‌ మెయిల్‌ చేసే రాజకీయ నాయకులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలా, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ రియాజుల్‌ హసన్‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని కుటుంబాలన్నింటికీ కేసీఆరే పెద్ద

ప్రధాని చెప్పినట్లు తమది బరాబర్‌ కుటుంబ పార్టీయేనని, తెలంగాణలోని అన్ని కుటుంబాలకు పెద్ద కేసీఆర్‌ అని కేటీఆర్‌ స్పష్టంచేశారు. నల్గొండ, సూర్యాపేటలలో నిర్వహించిన సభల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ... ‘‘గత తొమ్మిదిన్నరేళ్లుగా తెలంగాణలో అద్భుతాలు చేస్తున్న భారాసది ముమ్మాటికీ వారసత్వ రాజకీయమే. మాది గాంధీ వారసత్వమైతే... భాజపాది గాడ్సే వారసత్వం. కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీలకు వారంటీ లేదు. ఓటుకు నోటు కేసులో దొరికి, ఎమ్మెల్యేల సీట్లు అమ్ముకునే వారి మాటలను ప్రజలు నమ్మొద్దు. జగదీశ్‌రెడ్డికి డిపాజిట్‌ రాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటున్నారు... సూర్యాపేట నుంచి పోటీ చేస్తే డిపాజిట్‌ ఎవరికి వస్తుందో తెలుస్తుంది. కాంగ్రెస్‌ను నమ్మితే రైతన్నల జీవితం అంధకారం అవుతుంది. దిల్లీ నుంచి సీల్డ్‌ కవర్‌లో ఏడాదికో సీఎం పేరు వస్తుంది. నల్గొండలో జానారెడ్డి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి లాంటి నాయకులు మంత్రి పదవుల్లో ఏళ్లపాటున్నా... లక్షన్నర మందిని కబళించిన ఫ్లోరైడ్‌ గురించి ఏనాడూ పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి ఫ్లోరైడ్‌ను తరిమికొట్టింది సీఎం కేసీఆర్‌. ఈ విషయం ప్రధాని మోదీ పార్లమెంటులోనే చెప్పారు. గత ఎన్నికలప్పుడు ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 4 వేల మెగావాట్లతో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని మూసేస్తామని హెచ్చరించారు. వీరికా మనం ఓటేయాలి? ఇటాంటి వారిని ఇంటికే పంపాలి’’ అని పిలుపునిచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ ఛైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, కిశోర్‌, లింగయ్య, భగత్‌, ప్రభాకర్‌రెడ్డి, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, నల్గొండ, సూర్యాపేట కలెక్టర్లు ఆర్‌.వి. కర్ణన్‌, వెంకట్‌రావు, ఎస్పీలు అపూర్వరావు, రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బాలరాజు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని