సోదాల కలకలం

తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం పెద్దఎత్తున సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో 53 చోట్ల.. తెలంగాణలో 9 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమైంది.

Published : 03 Oct 2023 02:58 IST

ఏపీలో 53, తెలంగాణలో 9 చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు
హైకోర్టు న్యాయవాది సురేశ్‌కుమార్‌ ఇంట్లోనూ
ముంచంగిపుట్టు మావోయిస్టు కుట్ర కేసులో తనిఖీలు చేసినట్లు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే యంత్రాంగం: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం పెద్దఎత్తున సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో 53 చోట్ల.. తెలంగాణలో 9 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమైంది. ప్రజాసంఘాల నేతల ఇళ్లలోనే ఈ సోదాలు చోటుచేసుకోవడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టు కేసులతోపాటు ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును వాదిస్తున్న హైకోర్టు న్యాయవాది సురేశ్‌కుమార్‌ ఇంట్లోనూ సోదాలు చేయడం వివాదాస్పదమైంది. సోమవారం తెల్లవారుతూనే స్థానిక పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ బృందాలు నేతల ఇళ్లకు చేరుకుని సాయంత్రం వరకు సోదాలు కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, వైయస్‌ఆర్‌, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో.. తెలంగాణలో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, హనుమకొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని 62 ప్రాంతాల్లో మూకుమ్మడిగా సోదాలు జరిగాయి. అనంతరం వివిధ తేదీల్లో హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని వారందరికీ ఎన్‌ఐఏ నోటీసులు జారీచేసింది.

మావోయిస్టు అనుబంధ సంఘాల కుట్రగా వెల్లడి

‘ముంచంగిపుట్టు కుట్ర కేసు’లో భాగంగానే ఈ సోదాలు జరిగినట్లు ఎన్‌ఐఏ ఓ ప్రకటన జారీ చేసింది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పీకేఎస్‌) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్ర నర్సింహులును అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించింది. ఆయన ఇంటి నుంచి పిస్టల్‌, 15 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. వైయస్‌ఆర్‌ జిల్లాలో రూ.13 లక్షల నగదు, మిగిలిన ప్రాంతాల్లో మావోయిస్టు సాహిత్యాన్ని జప్తు చేసినట్లు ప్రకటించింది. మావోయిస్టు కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో పౌరహక్కుల సంఘం (సీఎల్‌సీ), అమరుల బంధుమిత్రుల సంఘం (ఏబీఎంఎస్‌), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌), కులనిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్‌), పేట్రియాటిక్‌ డెమోక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం), ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పీకేఎస్‌), ప్రజాకళా మండలి (పీకేఎం), విప్లవ రచయితల సంఘం (విరసం), మానవ హక్కుల ఫోరం (హెచ్‌ఆర్‌ఎఫ్‌), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సీఆర్పీపీ), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్స్‌ (ఐఏపీఎల్‌) తదితర సంఘాల పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. నర్సింహులు విచారణలో మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.  

హైదరాబాద్‌ విద్యానగర్‌ టీఆర్టీ కాలనీలోని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది డి.సురేశ్‌కుమార్‌ ఇంట్లో ఎన్‌ఐఏ 8 గంటలపాటు సోదాలు నిర్వహించింది. ఆయన బ్యాంకు ఖాతా లావాదేవీలను అధికారులు పరిశీలించారు. ముంచంగిపుట్టు కేసులో నిందితులకు లాయర్‌గా ఉన్నందున ఈ నెల 9న విచారణకు హాజరై, కేసు వివరాలు తెలపాలని 160 సీఆర్పీసీ (సాక్షిగా వాంగ్మూలం) కింద నోటీసులు ఇచ్చారు. ‘వృత్తి ధర్మంలో భాగంగా కేసులు వాదిస్తున్నాను. నా కేసుల వివరాలను నన్నే చెప్పమని అడగడటమేమిటి? భయభ్రాంతులకు గురిచేసేందుకే ఈ సోదాలు. న్యాయవాదిగా నా హక్కులను కాలరాయాలని చూస్తున్నవారికి న్యాయవ్యవస్థతోనే  బుద్ధిచెబుతాం’ అని సురేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

  • అల్వాల్‌లో ఏబీఎంఎస్‌ ప్రతినిధి భవానీ ఇంటికి ఉదయం 4.30కే ఎన్‌ఐఏ బృందం చేరుకుంది. ఆమె లేకపోవడంతో భర్త కృష్ణను ప్రశ్నించింది.  
  • హబ్సిగూడ గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని సుఖ విస్టాస్‌ అపార్ట్‌మెంటు ప్లాట్‌ నంబరు 723లో  ప్రగతిశీల కార్మిక సమైక్య సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాజు ఇంట్లో తనిఖీ చేశారు.
  • రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ఆగిర్యాలలో పీకేఎం ప్రతినిధి గుమ్మడి రాంచందర్‌ ఇంట్లో సోదాలు చేసి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 8న విచారణకురావాలని నోటీసు ఇచ్చారు.
  • హనుమకొండలో ఏబీఎంఎస్‌ ప్రతినిధి జన్ను శంతమ్మ, సీఎంఎస్‌ ప్రతినిధి అనిత ఇంటితోపాటు ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగులో సోదాలు చేశారు.

ప్రజాసంఘాల నిరసన

న్‌ఐఏ సోదాలపై ప్రజాసంఘాల నుంచి నిరసనలు మిన్నంటాయి. హక్కుల సంఘాలు, మేధావులు, కవులు, రచయితలపై ఎన్‌ఐఏ అక్రమంగా దాడులు చేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ ఆరోపించారు. నిషేధిత సాహిత్యాన్ని ఎన్‌ఏఐ అధికారులే తెచ్చి ఇళ్లలో పెట్టి నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసంఘాల నేతల ఇళ్లల్లో పిల్లలను, వృద్ధులను భయాందోళనలకు గురిచేసిన ఎన్‌ఐఏ దాడులను పలు పార్టీలు ఖండించాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ ప్రతినిధులు వసంతలక్ష్మి, జీవన్‌కుమార్‌, వీఎస్‌ కృష్ణ, చంద్రశేఖర్‌, డా.తిరుపతయ్య విజ్ఞప్తి చేశారు. ఎన్‌ఐఏ దాడుల్ని ఖండిస్తున్నట్లు సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు.

కేసు నేపథ్యమిది..: 2020 నవంబరు 23న అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం రుద్రకోట- కుమడ మార్గంలో పోలీసులు వాహన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి మావోయిస్టు సాహిత్యం, మందులు, ఎలక్ట్రిక్‌ వైర్ల వంటి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని పెదబయలు మండలానికి  చెందిన పంగి నాగన్న(35)గా గుర్తించారు. మావోయిస్టు అనుబంధ సంఘాల నేతలు ఆ సామగ్రిని మావోయిస్టులకు అందజేయాలని ఇచ్చినట్లు నాగన్న విచారణలో తెలపడంతో 64 మందిపై కేసునమోదు చేశారు. ఆ కేసును ఎన్‌ఐఏ 2021 మార్చి 7న తిరిగి నమోదుచేసి మరో 20 మంది నిందితుల్ని చేర్చింది. మే 21న అయిదుగురు మావోయిస్టు అనుబంధ సంఘాల నేతలతోపాటు మరో ఇద్దరిపై అభియోగపత్రం దాఖలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని