నేడు ఇందూరుకు ప్రధాని

ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Published : 03 Oct 2023 02:58 IST

రూ.8 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
అనంతరం సభలో మోదీ ప్రసంగం

ఈనాడు, నిజామాబాద్‌: ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని బీదర్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటారు. కలెక్టరేట్‌ ఆవరణలోని హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గంలో సమీపంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో వేర్వేరుగా ఏర్పాటుచేసిన అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభల  వేదికల వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3:40 గంటల వరకు ఓ సభా వేదిక పైనుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలుంటాయి. అనంతరం 3:45కి సమీపంలోని బహిరంగ సభా వేదికపై నుంచి ప్రసంగిస్తారు. దీనికి ‘ఇందూరు జన గర్జన సభ’గా భాజపా నామకరణం చేసింది. సాయంత్రం 5 గంటలకు బీదర్‌కు తిరుగు ప్రయాణమవుతారు.  పర్యటనలో భాగంగా రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రూ.1,200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్‌-సిద్దిపేట మధ్య నిర్మించిన 76 కి.మీ కొత్త రైలు మార్గం, రూ.305 కోట్లతో మన్మాడ్‌-ముద్కేడ్‌-మహబూబ్‌నగర్‌- డోన్‌ మధ్య చేపట్టిన రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును, సిద్దిపేట-సికింద్రాబాద్‌ మార్గంలో తొలి రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు. వీటితోపాటు సుమారు రూ.1,360 కోట్లతో 496 బస్తీ దవాఖానాల ఏర్పాటు, ఆయుష్మాన్‌ భారత్‌ కింద పలు జిల్లా కేంద్రాల్లో 50 పడకలతో నిర్మించబోయే 20 క్రిటికల్‌ కేర్‌ విభాగాల పనులను ప్రధాని ప్రారంభిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి.

పసుపు బోర్డుపై మరోసారి..

పసుపు బోర్డు ఏర్పాటు నినాదం పుట్టింది, ఇందుకోసం పోరాటాలు జరిగింది నిజామాబాద్‌ జిల్లాలోనే. గత ఎన్నికల సందర్భంలో భాజపా రైతులకు ఈ హామీ ఇచ్చింది కూడా ఇక్కడే. ఈ నేపథ్యంలో ఇక్కడే పసుపు బోర్డు ప్రకటన ఉంటుందని అంతా భావించారు. అందుకుభిన్నంగా పాలమూరు సభలోనే బోర్డు ఏర్పాటుకు నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మోదీ పాల్గొనే సభకు పెద్ద ఎత్తున పసుపు రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పసుపు బోర్డు అంశాన్ని ఇక్కడ జరిగే సభలో మరోమారు ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్న క్రమంలో.. బోర్డు ఎక్కడ ఏర్పాటుచేయనున్నారు? దానికి ఎంతకాలం పడుతుంది? తదితర విషయాలపై ప్రధాని స్పష్టత ఇస్తారని రైతులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని