5 శాతం ఐఆర్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ(పీఆర్‌సీ)ని నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాత పీఆర్‌సీ అమలు గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది.

Updated : 03 Oct 2023 10:36 IST

వేతన సవరణ కమిటీ ఏర్పాటు
ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ(పీఆర్‌సీ)ని నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాత పీఆర్‌సీ అమలు గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో 5% మధ్యంతర భృతి(ఐఆర్‌)ని ఈ నెల ఒకటి నుంచి ఇవ్వాలని ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. పీఆర్‌సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శివశంకర్‌ను, సభ్యుడిగా బి.రామయ్యను నియమించింది. ఆరు నెలల్లోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి సూచించింది. రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రస్తుత, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని వేతన సవరణపై సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. ఈ కమిటీకి సిబ్బందిని, నిధులను కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.

ఉద్యోగులు, పింఛన్‌దారులకే ఐఆర్‌...  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రభుత్వం నుంచి నిధులు గ్రాంటుగా పొందే సంస్థల్లో పని చేసే వారు, వర్క్‌ఛార్జ్‌డ్‌ ఉద్యోగులకే ఈ నెల నుంచి ఐఆర్‌ ఇవ్వాలని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. రాష్ట్ర జ్యుడిషియల్‌ సర్వీసుల్లో పని చేసే వారికి, ఆల్‌ ఇండియా సర్వీసుల వారికి, యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఏఆర్‌, కేంద్ర వేతనాలు పొందేవారికి, కాంట్రాక్డు ఉద్యోగులు, సొసైటీలు, స్వతంత్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లోని వారికి ఐఆర్‌ ఇవ్వకూడదని స్పష్టంచేసింది. ఉద్యోగి మూలవేతనంలో ఐఆర్‌ ఇచ్చే సమయంలో పెంపు సొమ్ములో 50 పైసలు ఉన్నట్లయితే దాన్ని తర్వాతి రూపాయికి పెంచి ఇవ్వాలి. 50 పైసలలోపు వస్తే దాన్ని తగ్గించి ఇవ్వాలి. ఉదాహరణకు ఎవరైనా ఒక ఉద్యోగికి 5% ఐఆర్‌ కింద రూ.1565.56 వస్తే ఆయనకు రూ.1566 ఇవ్వాలి. ఒకవేళ 1565.49 వస్తే 49 పైసలు తొలగించి రూ.1565 మాత్రమే ఇవ్వాలని ఆర్థికశాఖ సూచించింది. ఉద్యోగి వేతనంలో డీఏ, ఇంటి అద్దె భత్యం, ఇతర అలవెన్సులు వంటివాటిపై ఐఆర్‌ లెక్కించరాదు. కేవలం మూల వేతనంపైనే 5% అదనంగా ఇవ్వాలని స్పష్టంచేసింది.

ఏడాదికి రూ.2 వేల కోట్లకు పైనే భారం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షల మంది, మరో 3 లక్షల మంది పింఛన్‌దారులకు ఐఆర్‌ వర్తిస్తుంది. దీని అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.2 వేల కోట్లకు పైగా ఆర్థికభారం పడుతుందని అంచనా. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు పీఆర్‌సీని అమలుచేసింది. ఈ నెలలో ఎన్నికల షెడ్యూలు విడుదల నేపథ్యంలో తాజాగా ఐఆర్‌ను ప్రకటించింది. కమిటీ నివేదికను ఇవ్వడానికి 2024 మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అప్పటికి లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. గడువులోగా కమిటీ నివేదిక ఇచ్చినా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే అంటే 2024 జూన్‌లోనే పీఆర్‌సీ సిఫార్సుల అమలుకు అవకాశం ఉంటుంది.


సభ్యుడిగా నియమితులైన విశ్రాంత ఐఏఎస్‌ బి.రామయ్య ఉమ్మడి రాష్ట్రంలో లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత గ్రూప్‌-1 సర్వీసుకు ఎంపికై కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ అధికారిగా నియమితులై అనేక శాఖల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్‌ శాఖ కార్యదర్శిగా రిటైరయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయనకు ప్రభుత్వ సర్వీసులపై సుదీర్ఘ అనుభవం ఉంది.


మెరుగైన ఐఆర్‌కు విన్నవిస్తాం

-టీఎన్‌జీఓ

పీఆర్‌సీ నియామకంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన టీఎన్‌జీఓ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి మెరుగైన ఐఆర్‌ విడుదల చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరతామని తెలిపింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, సీపీఎస్‌ రద్దు, డీఏల విడుదల తదితర పెండింగ్‌ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని వారు తెలిపారు.


అధికారుల సంఘాల హర్షం

పీఆర్‌సీ ఏర్పాటు ఉత్తర్వులపై తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ పద్మాచారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస ఛైర్మన్‌ కె.లక్ష్మయ్య, విశ్రాంత టీజీవోల సంఘం అధ్యక్షుడు మోహన్‌నారాయణ, తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షుడు కమలాకర్‌, తెలంగాణ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ హర్షం వ్యక్తంచేశారు.


5 శాతం ఐఆర్‌ శోచనీయం

-ఎస్‌టీయూటీఎస్‌

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్‌సీని నియమించడం హర్షణీయమని, ఐఆర్‌ను 5% ప్రకటించడం శోచనీయమని ఎస్‌టీయూటీఎస్‌ పేర్కొంది. 15% ఐఆర్‌ను ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఒక డీఏకు కూడా సరిపోని ఐఆర్‌ను ఇవ్వడమంటే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లను అవమానించడమేనని టీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి పేర్కొన్నారు.


గడువులోగా నివేదిక తెప్పించి అమలు చేయాలి

-సంఘాలు

పీఆర్సీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు టీఎస్‌ యూటీఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు నెలల్లో నివేదిక తెప్పించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి పేర్కొన్నారు. అయితే... ఐఆర్‌ కేవలం 5% ప్రకటించడం టీచర్లు,  ఉద్యోగులకు ఊహకందని అంశంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గత పీఆర్సీ బకాయిలను అందజేయాలని కోరారు. మధ్యంతర భృతి 20% ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్‌ సురేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 5% ఐఆర్‌ ప్రకటించడం ఉద్యోగులను అవమానించడం లాంటిదని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి, 20% ప్రకటించాలని ఇంటర్‌ విద్యా ఐకాస ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు