విశాఖ ఇండస్ట్రీస్‌, విజిలెన్స్‌సెక్యూరిటీ ఖాతాల్లోకి భారీగా నగదు జమ..!

బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంకులో రెండు సంస్థల ఖాతాల్లోకి జమైన భారీ నగదును ఫ్రీజ్‌ చేసినట్లు మధ్యమండలం డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు.

Updated : 20 Nov 2023 07:38 IST

రూ.8 కోట్లు ఫ్రీజ్‌ చేసిన పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంకులో రెండు సంస్థల ఖాతాల్లోకి జమైన భారీ నగదును ఫ్రీజ్‌ చేసినట్లు మధ్యమండలం డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఎన్నికల సమయంలో బ్యాంకు లావాదేవీలపై ఈసీ అధికారులు నిఘా ఉంచారు. ఖాతాల్లో జమయ్యే అక్రమ నగదు వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విజిలెన్స్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాల్లోకి రూ.8 కోట్లు జమయ్యాయి. గుర్తుతెలియని ఖాతా నుంచి పెద్దఎత్తున నగదు బదిలీ కావటంపై సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు సదరు లావాదేవీలపై ఆరా తీసి నగదును స్తంభింపజేశారు. ఈ మేరకు ఐడీబీఐ బ్రాంచి మేనేజర్‌, నోడల్‌ అధికారి, ఆదాయపన్నుశాఖ, ఈడీ జాయింట్‌ డైరెక్టర్లకు లేఖ ద్వారా తెలియజేశామని డీసీపీ తెలిపారు. రెండు సంస్థల ఖాతాల్లోకి భారీ ఎత్తున నగదు జమ చేసిన వారి గురించి ఆరా తీస్తున్నామని డీసీపీ తెలిపారు. పూర్తి ఆధారాలు లభించాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఓ ప్రధాన పార్టీకి చెందిన కీలక నాయకుడి కోసమే నగదు బదిలీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని