ఏడాది పీజీ కోర్సులు!

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు అంటే ఇప్పటివరకు రెండేళ్లు చదవాల్సి వచ్చేది. ఇక నుంచి నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని పూర్తి చేసిన వారు ఏడాది పీజీ కోర్సు చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ యూజీసీ పచ్చజెండా ఊపింది.

Updated : 20 Nov 2023 07:36 IST

నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన వారికి వెసులుబాటు
రెండేళ్ల పీజీలో ఏడాది తర్వాత  మానుకుంటే డిప్లొమా పట్టా
యూజీసీ ముసాయిదా   మార్గదర్శకాల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు అంటే ఇప్పటివరకు రెండేళ్లు చదవాల్సి వచ్చేది. ఇక నుంచి నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని పూర్తి చేసిన వారు ఏడాది పీజీ కోర్సు చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ యూజీసీ పచ్చజెండా ఊపింది. త్వరలో ఆ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యా ప్రణాళిక, క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌లకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. దానిపై అభ్యంతరాలు, సూచనలను పంపేందుకు తుది గడువు డిసెంబరు 15వ తేదీగా నిర్ణయించింది. వాటిని పరిశీలించి డిసెంబరు లేదా జనవరిలో తుది మార్గదర్శకాలు విడుదల చేస్తారు. నూతన జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా పీజీ విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన యూజీసీ.. అందులో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకుంది.

ముఖ్యాంశాలు..

  • మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసిన వారు ఇప్పటి మాదిరిగానే రెండేళ్ల పీజీ చదువుతారు. నాలుగేళ్ల ఆనర్స్‌ పూర్తిచేసిన వారు మాత్రం ఏడాదిపాటు పీజీ చదవొచ్చు. డిగ్రీలో చదివిన సబ్జెక్టుల్లో ఏదైనా ఒక సబ్జెక్టును పీజీలో ఎంచుకొని పూర్తి చేయవచ్చు.
  • మూడేళ్లు డిగ్రీ చదివిన వారు రెండేళ్ల పీజీలో చివరి ఏడాది పూర్తిగా పరిశోధనకే కేటాయిస్తారు. ప్రథమ సంవత్సరం చదివి మానుకుంటే పీజీ డిప్లొమా పట్టా అందజేస్తారు. తర్వాత ఆసక్తి ఉన్నప్పుడు రెండో ఏడాది పూర్తి చేస్తే పీజీ ధ్రువపత్రం ఇస్తారు.
  • ఆఫ్‌లైన్‌లో చదవాలా? ఆన్‌లైన్‌లో చదవాలా.. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానాల్లో చదవాలా? అన్నది విద్యార్థుల ఇష్టం.
  • మరిన్ని అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్టిఫిషియల్‌ లెర్నింగ్‌తో అనుసంధానించిన హెల్త్‌కేర్‌, అగ్రికల్చర్‌, లా తదితర కోర్సులను ప్రవేశపెట్టుకునేందుకు అనుమతి ఇస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని