ఎక్కువ దొరికింది తెలంగాణలోనే!

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 20వ తేదీ నాటికి ఈ రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొంది.

Published : 21 Nov 2023 07:02 IST

స్వాధీనం చేసుకున్న నగదులో 60% ఇక్కడిదే..
5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటి వరకు రూ. 1,760 కోట్ల సొత్తు పట్టివేత

ఈనాడు, దిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 20వ తేదీ నాటికి ఈ రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొంది. ఇందులో రూ.659.2 కోట్ల సొత్తుతో తెలంగాణ తొలి స్థానంలో, రూ.650.7 కోట్లతో రాజస్థాన్‌ రెండో స్థానంలో నిలిచాయి. మొత్తం అయిదు రాష్ట్రాల్లో కలిపి రూ.372.9 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా అందులో 60% (రూ.225.23 కోట్లు) తెలంగాణలోనే లభించింది. మద్యం, డ్రగ్స్‌, విలువైన లోహాల స్వాధీనంలోనూ తెలంగాణే తొలిస్థానాన్ని ఆక్రమించింది. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో 2018 ఎన్నికల సమయంలో దొరికిన రూ.239.15 కోట్లతో పోలిస్తే ఈసారి ఇప్పటివరకు దొరికిన సొత్తు విలువ 636% అధికంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అయిదు రాష్ట్రాల కంటే ముందు జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక ఎన్నికల్లో రూ.1,400 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నామని.. అది ఆయా రాష్ట్రాల్లో అంతకు ముందు అయిదేళ్ల కిందట స్వాధీనం చేసుకున్న మొత్తంతో పోలిస్తే 1009.12% అధికమని ఈసీ వెల్లడించింది. ఈసారి తాము ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ (ఈఎస్‌ఎంస్‌) ద్వారా అభ్యర్థుల వ్యయంపై నిఘా ఉంచినట్లు పేర్కొంది. 228 మంది అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన అధికారులను అయిదు రాష్ట్రాల ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు నియమించినట్లు తెలిపింది. అత్యధిక వ్యయం జరగడానికి అవకాశం ఉన్న 194 అసెంబ్లీ నియోజకవర్గాలపై సూక్ష్మస్థాయిలో దృష్టి సారించినట్లు వెల్లడించింది. ధన ప్రభావ నియంత్రణ చర్యలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇకముందు కూడా కొనసాగుతాయని, స్వాధీనం చేసుకొనే సొత్తు విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు