రాష్ట్రమంతటా పరిశ్రమల స్థాపన

రాజధాని హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టిసారించిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

Published : 12 Jun 2024 04:36 IST

మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టిసారించిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాల నుంచి గ్రామాల వరకు పరిశ్రమల స్థాపనే లక్ష్యమని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు విస్తరించాలి. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. తెలంగాణ అభివృద్ధి వ్యూహంలో భాగంగా నూతన సాంకేతికతలు, కృత్రిమమేధకు ప్రాధాన్యమిస్తాం. మా వినతి మేరకు కోకాకోలా పెద్దపల్లి జిల్లాలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్లాంటు పెట్టేందుకు అంగీకరించింది. దీంతోపాటు తెలంగాణలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుపై లైఫ్‌ సైన్సెస్, ఐటీ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. రక్షణ, వైమానిక రంగంలో కొత్త పెట్టుబడులను సమీకరిస్తున్నాం. పేరొందిన వైమానిక సంస్థలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపుతున్నాయి. బోయింగ్, రేథియాన్‌ సంస్థలతోనూ చర్చిస్తున్నాం. 

బెంగళూరు కంటే హైదరాబాద్‌ మేలు 

కర్ణాటక రాజధాని బెంగళూరు కంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే విస్తృత ప్రయోజనాలున్నాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులతోపాటు సమర్థమైన పాలనకు హైదరాబాద్‌ పేరుగాంచింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్‌ వంటి టెక్‌ దిగ్గజాలకు కోడింగ్‌ పనులు నగరంలోనే జరుగుతున్నాయి. గ్లోబల్‌ టెక్‌ పురోగతికి హైదరాబాద్‌ చరిత్రాత్మకంగా దోహదపడింది. కేంద్రంలో మూడో దఫా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని