అచ్చు తప్పు కాదు.. నిర్లక్ష్యమే

రాష్ట్రంలో 1 నుంచి 10 తరగతుల తెలుగు వాచకం పాఠ్యపుస్తకాల్లో ముందుమాట పేజీని హుటాహుటిన తొలగించి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు.

Published : 13 Jun 2024 05:23 IST

తెలుగు వాచకం ముందుమాటలో నాటి మంత్రులు, అధికారుల పేర్లు
1 నుంచి 10 తరగతుల వరకు అదే వరుస
ఆ పేజీ తొలగించి ఇవ్వాలని ఆదేశాలు..

ఈనాడు- హైదరాబాద్, హనుమకొండ; ఈనాడు యంత్రాంగం: రాష్ట్రంలో 1 నుంచి 10 తరగతుల తెలుగు వాచకం పాఠ్యపుస్తకాల్లో ముందుమాట పేజీని హుటాహుటిన తొలగించి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలుగు వాచకం పుస్తకాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పలుమార్పులు చేశారు. అందుకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రులు, అధికారులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారని, వారికి ధన్యవాదాలు చెబుతూ.. ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకులు పేరిట ముందుమాట రాశారు. అందులో ‘ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి’, ‘పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి రంజీవ్‌ ఆర్‌.ఆచార్య’, ‘ప్రస్తుత సంచాలకులు టి.చిరంజీవులు’ అంటూ పాత ముద్రణను యథాతథంగా ఉంచారు. గత నవంబరులో ప్రభుత్వం మారింది. అయినా సబితా ఇంద్రారెడ్డి.. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అని, పాత అధికారులను ప్రస్తుత అధికారులని ముద్రణలో రావడం విమర్శలకు తావిచ్చింది. దీంతో ఆ పేజీని తొలగించి విద్యార్థులకు పంపిణీ చేయాలని శ్రీదేవసేన ఆదేశించారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోని ఎస్‌సీఈఆర్‌టీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేజీని తొలగించడంతో వెనుక వైపు ఉన్న వందేమాతరం, జాతీయ గీతం, సామూహిక ప్రతిజ్ఞ కూడా పుస్తకంలో లేకుండా పోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని