జీవో 317పై 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలో జీవో నం. 317 సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14 నుంచి 30 వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

Published : 13 Jun 2024 05:28 IST

 సమీక్ష సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
స్థానికత నమోదుకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జీవో నం. 317 సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14 నుంచి 30 వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ జీవోపై బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడైన రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జీవో 317తో తమకు అన్యాయం జరిగిందని, తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని, దంపతులకు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటివరకు 12 వేల మందికిపైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించాలని మంత్రులు ఆదేశించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరో దఫా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. దరఖాస్తుల్లో స్థానికత (లోకల్‌ స్టేటస్‌) నమోదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్తకు సైతం బదిలీ కోరుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఉద్యోగులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ ద్వారా సమాచారం తెలపాలని, రసీదు పంపించాలని నిర్దేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని