వీఆర్వోల వెతలు తీరేనా?

గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దు తరువాత బదలాయింపు ప్రక్రియలో జరిగిన తప్పులు అన్నీ ఇన్నీ కావు.

Published : 13 Jun 2024 05:37 IST

సర్దుబాటు పేరుతో ఉద్యోగులకు పోటు
తోటమాలి, డ్రైవర్‌ పోస్టుల కేటాయింపు
సరిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దు తరువాత బదలాయింపు ప్రక్రియలో జరిగిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. రెండేళ్లు గడుస్తున్నా వారి పోస్టులు, ఉద్యోగాల తీరు అస్తవ్యస్తంగా ఉంది. ఒక శాఖ నుంచి మరో శాఖకు ఉద్యోగుల బదలాయింపు జరిగితే విధుల తీరు మారినా పాత ఉద్యోగానికి సమానమైన పోస్టు ఇవ్వాల్సి ఉండగా వీఆర్వోల విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. 2022 జులై 23న 5,138 మంది వీఆర్వోలను రెవెన్యూ నుంచి ఇతర శాఖల్లోకి మార్చిన సమయంలో జరిగిన లోపాలు వారిని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. పోస్టేమో.. జూనియర్‌ అసిస్టెంట్‌కు సమానమైంది. చేసే ఉద్యోగం తోటమాలి, డ్రైవర్, అటెండర్, వసతి గృహాల్లో వర్కర్లు, వాచ్‌మెన్‌ల విధులు. అయినా వేతనాలు, ఇంక్రిమెంట్ల అమలు లేదు. దాదాపు రెండు వేల మంది ఇలాగే సర్దుకుపోతున్నారు. మరోవైపు కొందరికి సీనియర్‌ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌ లాంటి ఉన్నత ఉద్యోగాల పోస్టులు కేటాయించారు. సర్వీసు పరంగా ఇది కూడా ఇబ్బందే. 

తిరిగి శాఖలోకి తీసుకోవాలి

‘ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గతంలో జరిగిన తప్పుల నుంచి పూర్వ వీఆర్వోలకు న్యాయం చేయాలి. ఎన్నో ఏళ్లు రెవెన్యూలో సర్వీసు అందించిన వారికి ఐచ్ఛికాలు ఇచ్చి తిరిగి శాఖలోకి తీసుకోవాలి’ అని తెలంగాణ పూర్వ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు కోరారు.


లాటరీ పద్ధతి నుంచి.. కష్టాలు.. నష్టాలే 

ఏళ్ల తరబడి రెవెన్యూశాఖలో కొనసాగిన వీఆర్వోలను 2020లో ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తొలగించింది. విధుల్లో ఉన్న 5,138 మందిని ఏ శాఖలోకి వెళ్లాలనే అవకాశం ఇవ్వకుండానే లాటరీ పద్ధతిలో సర్దుబాటు చేశారు.  పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలతోపాటు వివిధ కార్పొరేషన్లలోనూ నియమించారు. 

  • 1200 మందిని ప్రభుత్వానికి వెలుపల ఉన్న సొసైటీలు, కార్పొరేషన్లు, పౌరసరఫరాలు, గ్రంథాలయ సంస్థ తదితర విభాగాల్లో నియమించారు. 
  • రెవెన్యూశాఖలో 010 పద్దు ద్వారా వేతనాలు అందగా.. వీటిలో అవి లేవు. దీంతో పదవీ విరమణ తరువాత సామాజిక భద్రత అంశంపై గందరగోళం ఉంది. ప్రతినెలా జీతం అందాల్సి ఉండగా.. సొసైటీల బడ్జెట్‌ ప్రకారం వేతనాలు వస్తున్నాయి. 
  • ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం ఐఆర్‌ వీరికి అమలవడం లేదు. కారుణ్య నియామకాల అమలు లేదు. పాత డీఏ, పీఆర్సీలు, ఇతర బకాయిలు అందడం లేదు. 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జీసీసీలో చేరిన 16 మందికి దాదాపు 22 నెలలుగా వేతనాలు లేవు. పురపాలక శాఖలో చేరిన వారికి కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ సర్దుబాటు పూర్తికాలేదు. 
  • ఏటా ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. 
  •  వెయ్యిమందికి  ప్రొబేషన్‌ డిక్లరేషన్, సెలవు సమస్యలు, ఇంక్రిమెంట్లు మంజూరు కాకుండా సీసీఎల్‌ఏలో పెండింగ్‌లో ఉన్నాయి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని