కోర్టు ఆదేశించినా పింఛను బకాయిలు చెల్లించలేదు

శాఖాపరమైన విచారణ పేరుతో 18 ఏళ్లుగా నిలిపివేసిన పింఛను బకాయిలు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా చెల్లించకపోవడంతో స్పోర్ట్స్‌ అథారిటీ వీసీ, ఎండీ శైలజా రామయ్యర్‌పై శామీర్‌పేటకు చెందిన ఉద్యోగి కె.దొరారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 14 Jun 2024 05:33 IST

శాప్‌ ఎండీపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌
హైకోర్టు తీర్పు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: శాఖాపరమైన విచారణ పేరుతో 18 ఏళ్లుగా నిలిపివేసిన పింఛను బకాయిలు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా చెల్లించకపోవడంతో స్పోర్ట్స్‌ అథారిటీ వీసీ, ఎండీ శైలజా రామయ్యర్‌పై శామీర్‌పేటకు చెందిన ఉద్యోగి కె.దొరారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్‌ ఎస్‌.నంద విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. దొరారెడ్డిపై 1985-94 మధ్య వచ్చిన ఆరోపణలపై తుది ఉత్తర్వులు జారీ చేయకుండా పింఛను, గ్రాట్యుటీ నిలిపివేశారన్నారు. రూ.4.48 లక్షల బకాయిలు చెల్లించాలంటూ గత ఏడాది జూన్‌లో ఈ కోర్టు ఉత్తర్వులు జారీచేసినా వాటిని అమలు చేయలేదన్నారు. శాప్‌ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగి అయిన పిటిషనర్‌కు ప్రభుత్వమే పింఛను చెల్లించాల్సి ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలంటూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. అలాగే పిటిషనర్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువైందని, దీనికి సంబంధించి యువజన సర్వీసులు, క్రీడాశాఖ గత ఏడాది అక్టోబరులో జీవో 292 జారీ చేసిందన్నారు. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బకాయిలు చెల్లించాలంటూ జూన్‌లోనే ఈ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, వాటిని అమలు చేయొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం అక్టోబరులో జీవో జారీ చేసిందన్నారు. ఇది కోర్టు ధిక్కరణేనని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని