ఇంటి రుణం వడ్డీ రాయితీపై కాల పరిమితి ఎత్తివేత

సింగరేణి కార్మికులు, ఉద్యోగుల గృహ రుణాలకు సంబంధించి వడ్డీ రాయితీ చెల్లింపులపై యాజమాన్యం మరింత వెసులుబాటు కల్పించింది. ఏడాది లోపు రుణం తీసుకుంటేనే రాయితీ వర్తిస్తుందనే నిబంధనను సడలించింది.

Published : 14 Jun 2024 05:33 IST

సింగరేణిలో 4 వేల మంది కార్మికులకు లబ్ధి

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణి కార్మికులు, ఉద్యోగుల గృహ రుణాలకు సంబంధించి వడ్డీ రాయితీ చెల్లింపులపై యాజమాన్యం మరింత వెసులుబాటు కల్పించింది. ఏడాది లోపు రుణం తీసుకుంటేనే రాయితీ వర్తిస్తుందనే నిబంధనను సడలించింది. సొంతింటి నిర్మాణం లేదా ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణంపై వడ్డీ రాయితీ పథకాన్ని సింగరేణి సంస్థ 2018 నుంచి అమలుచేస్తోంది. గరిష్ఠ రుణ పరిమితి రూ.10 లక్షలుగా నిర్ణయించింది. నిర్మాణం ప్రారంభించిన లేదా ఇంటిని కొనుగోలు చేసిన ఏడాదిలోగా బ్యాంకు నుంచి రుణం పొందాల్సి ఉంటుంది. గడువులోగా రుణం మంజూరైన వారి దరఖాస్తులనే ఇప్పటివరకు ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా ఏడాది కాల పరిమితి నిబంధనను యాజమాన్యం సడలించింది. ఎప్పుడు రుణం పొందినా పథకం వర్తింపజేస్తూ గురువారం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. వడ్డీ మొత్తంలోనూ కొన్ని సడలింపులు వర్తింపజేస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రస్తుతం 8.33 శాతం కన్నా తక్కువ వడ్డీకి రుణం తీసుకున్న వారికి మాత్రమే 6-7 శాతం వరకు వడ్డీ రాయితీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుండగా, ఇకపై 8.33 శాతం వరకు షరతుల్లేకుండా వడ్డీ రాయితీ వర్తింపజేయనున్నారు. కాల పరిమితి సడలింపుతో 4 వేల మందికి ప్రయోజనం కలుగుతుందని సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరాం తెలిపారు. యాజమాన్యంతో జరిపిన చర్చల ఫలితంగానే సడలింపులు వచ్చాయని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని