రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడి నియామకంలో జాప్యమెందుకు?

రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చినా జాప్యం ఎందుకు జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

Published : 14 Jun 2024 05:34 IST

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూటిప్రశ్న

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చినా జాప్యం ఎందుకు జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తికి పరీక్ష అవసరంలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నప్పటికీ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నిలదీసింది. అధ్యక్షుడిని ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలంటూ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడి పోస్టును భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బగ్లేకర్‌ ఆకాష్‌కుమార్‌ హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడిగా ఉన్న జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌ గత ఏడాది ఫిబ్రవరి 4న పదవీ విరమణ చేశారని, అప్పటి నుంచి పోస్టు ఖాళీగానే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వినియోగదారుల కమిషన్‌లు ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులపై రాష్ట్ర కమిషన్‌ అప్పీలేట్‌ అథారిటీగా ఉంటుందని, రూ.50 లక్షల విలువకు పైబడిన కేసులపై ఇక్కడే ఫిర్యాదులు దాఖలవుతుంటాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పుపై వివరణ కోరుతూ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిందని, దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కోరారు. ఆ వాదనతో ఏకీభవించని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వ్యక్తి పరీక్ష నిమిత్తం కార్యదర్శి ముందు హాజరుకావాల్సి ఉంటుందనే కారణంతోనే అధ్యక్ష పదవి చేపట్టేవారికి పరీక్ష అవసరంలేదని  సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం గమనించకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ప్రజలకు సేవలు అందించడానికేనని, దీనిపై ఉదాసీనత సరికాదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను పరిశీలించి వివరణ ఇస్తామంటూ ప్రభుత్వ న్యాయవాది హామీ ఇచ్చిన మీదట ధర్మాసనం విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని