లాసెట్‌లో 29,258 మంది పాస్‌

లాసెట్‌ రాసిన అభ్యర్థుల్లో 72.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు 50,684 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Published : 14 Jun 2024 05:38 IST

లాసెట్‌ ఫలితాల సీడీని విడుదల చేస్తున్న జీబీ రెడ్డి, లక్ష్మీనారాయణ, మహమూద్, లింబాద్రి,  వెంకటరమణ, శ్రీరాం వెంకటేశ్, విజయలక్ష్మి

ఈనాడు, హైదరాబాద్‌: లాసెట్‌ రాసిన అభ్యర్థుల్లో 72.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు 50,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 3న జరిగిన పరీక్షకు 40,268 మంది హాజరు కాగా.. అందులో 29,258 మంది కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటా సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ, కన్వీనర్‌ విజయలక్ష్మి, ఓయూ సీనియర్‌ ఆచార్యుడు జీబీ రెడ్డి తదితరులు గురువారం లాసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. పరీక్షల్లో అర్హత పొందిన వారిలో 20,237 మంది పురుషులు, 9,017 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) అనుమతి రాగానే రాష్ట్రంలో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ(ఇంటర్‌ విద్యార్హత), మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ(డిగ్రీ విద్యార్హత)తోపాటు ఎల్‌ఎల్‌ఎం సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 న్యాయవిద్య కళాశాలలు ఉన్నాయని, వాటిలో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలని లింబాద్రి చెప్పారు. మొత్తం 8,180 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని రెండు గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక్కో కళాశాలలో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉందని వివరించారు. లాసెట్‌ ప్రతినిధి, ఓయూ సీనియర్‌ ఆచార్యుడు జీబీ రెడ్డి మాట్లాడుతూ.. 2000 వరకు ‘సాయంత్రం ఎల్‌ఎల్‌బీ’ కోర్సు ఉండేదని, ఆ తర్వాత దాన్ని బీసీఐ నిషేధించిందని చెప్పారు. బీసీఐ అనుమతి ఇస్తే దాన్ని తిరిగి ప్రవేశపెట్టవచ్చన్నారు. లాసెట్‌లో అర్హత సాధించినవారిలో బీకాం చదివినవారు 5,790 మంది, బీఎస్సీ 5,068, బీఏ 4,044, బీటెక్‌ చదివినవారు 4,485 మంది ఉన్నారు. బీబీఏ, బీసీఏ, బీబీఎం, ఎంబీబీఎస్, బీడీఎస్, బీ-ఫార్మసీ, ఫార్మా-డీ తదితర కోర్సులు చదివినవారూ ఉత్తీర్ణులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని