కమ్మ సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి కృషి

రాష్ట్రంలోని కమ్మ సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి  ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Published : 14 Jun 2024 05:39 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ

సీఎం రేవంత్‌రెడ్డితో కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య ప్రతినిధులు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కమ్మ సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి  ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ‘కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య’ తెలంగాణ ప్రతినిధులు గురువారమిక్కడ సీఎంను కలిశారు. పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యలను వివరించగా రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని సీఎంను కలిసిన అనంతరం సమాఖ్య ప్రతినిధులు వెల్లడించారు. ‘కమ్మ సమాఖ్యకు కేటాయించిన స్థలంపై న్యాయస్థానంలో వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. యాదాద్రిలో సత్రం నిర్మించేందుకు సమాఖ్యకు స్థలం కేటాయించేందుకు సమ్మతించారు. నామినేటెడ్‌ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్మ కులస్థులకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. కమ్మ కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయిస్తామని, కమ్మ సామాజికవర్గంలోని పేదలకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు’ అని సమాఖ్య ప్రతినిధులు వివరించారు. సీఎంను కలిసిన వారిలో సమాఖ్య అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్‌రావు, ప్రధాన కార్యదర్శి గంగవరపు శ్రీరామకృష్ణప్రసాద్, కోశాధికారి కండెపనేని రత్నాకర్‌రావు, బండి రమేష్‌తోపాటు సోమూరి వెంకటకృష్ణ ప్రసాద్, కలగర శ్రీనివాసరావు, బిక్కసాని నాగేశ్వరరావు, బొడ్డు వెంకటేశ్వరరావు, బొడ్డు అశోక్, పెదనాటి వెంకటేశ్వరరావు, సూరపనేని సురేష్, పాలడుగు ఉమామహేశ్వరరావు, వేముల వెంకటేశ్వరరావు, నల్లమోతు రఘు, దోణవల్లి వేణు, వేమూరి సురేష్, యలవర్తి కిశోర్, కొత్తపల్లి శ్రీనివాసరావు, మందాడి కోటేశ్వరరావు, రాయపాటి వెంకటేశ్వరరావు, సిరిపురపు సంపత్‌కుమార్, యలమంచిలి కృష్ణారావు, ధనేకుల రాంబాబు, మాదాల రమణయ్య తదితరులు ఉన్నారు. కమ్మ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసినందుకు సమాఖ్య ప్రతినిధులు ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని సీఎం గురువారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని