నమూనాల సేకరణ నిలిపివేత

జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు అన్నారం బ్యారేజీలో చేపట్టిన నమూనాల సేకరణను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తెలిసింది.

Published : 15 Jun 2024 04:57 IST

అన్నారం బ్యారేజీలో కోర్‌ కటింగ్‌ కోసం డ్రిల్లింగ్‌తో భారీగా నీరు, ఇసుక బయటకు 

 ఈనాడు, హైదరాబాద్‌: జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు అన్నారం బ్యారేజీలో చేపట్టిన నమూనాల సేకరణను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తెలిసింది. కోర్‌ కటింగ్‌ కోసం రాఫ్ట్‌ వద్ద డ్రిల్లింగ్‌ చేపట్టగా భారీగా నీరు, ఇసుక బయటకు రావడంతో ఆందోళనకు గురైన ఇంజినీర్లు ముందుకెళ్లకుండా ఆపేసినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తాత్కాలిక మరమ్మతులతో పాటు ఇన్వెస్టిగేషన్స్‌ చేపట్టాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) సూచించింది. ఈ సిఫార్సుల మేరకు పనులు చేపట్టడంతోపాటు ఇన్వెస్టిగేషన్స్‌ కూడా ప్రారంభించారు. పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చి స్టేషన్‌ (సీడబ్ల్యుపీఆర్‌ఎస్‌), దిల్లీలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చి స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు బ్యారేజీలను పరిశీలించారు. ఎన్‌డీఎస్‌ఏతో పాటు ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఇన్వెస్టిగేషన్స్‌ కోసం నమూనాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా అన్నారం బ్యారేజీలో రాఫ్ట్‌ నుంచి కోర్‌ కటింగ్‌ చేసి నమూనాలు సేకరించడం ప్రారంభించారు. నాలుగు పియర్స్‌ వద్ద సీపేజీ గుర్తించి కెమికల్‌ గ్రౌటింగ్, కాంక్రీట్‌ గ్రౌటింగ్‌ చేశారు. అయితే సీపేజీ ఎక్కడి నుంచి వస్తుంది, పై నుంచి కిందికి ఉందా లేదా అని తెలుసుకోవడం, నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌కు నమూనాల సేకరణ చేపట్టారు. 25 మీటర్ల లోతులో ఉన్న మట్టి స్వభావాన్ని తెలుసుకొనేందుకు నమూనాల కోసం డ్రిల్లింగ్‌ చేయాలి. సీపేజీ వచ్చిన ఒక్కో పియర్‌ వద్ద బ్యారేజీ ఎగువన ఒకటి, దిగువన ఇంకోటి... ఇలా నాలుగు పియర్స్‌ వద్ద ఎనిమిది నమూనాలు సేకరించాలి. 35వ పియర్‌ వద్ద మొదటి నమూనా సేకరణకు రాఫ్ట్‌ వద్ద డ్రిల్లింగ్‌ చేపట్టగా భారీగా నీటితో పాటు ఇసుక కూడా కలిసి రావడంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లు ఆందోళనకు గురైనట్లు తెలిసింది. గతంలో సీపేజీ ఉన్నా ఇసుక రాలేదు. ఇప్పుడు కోర్‌ డ్రిల్లింగ్‌లో ఇసుక కూడా కలిసి రావడంతో నమూనాల సేకరణ ప్రక్రియను నిలిపివేసినట్లు తెలిసింది. వచ్చే వారం సీడబ్ల్యుపీఆర్‌ఎస్‌ నిపుణులు వచ్చిన తర్వాత వారితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని