కేటీఆర్‌ ఎన్నిక చెల్లదంటూ రెండు పిటిషన్లు

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన భారాస నేత కె.తారకరామారావుకు హైకోర్టు శుక్రవారం నోటీసులిచ్చింది.

Published : 15 Jun 2024 04:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన భారాస నేత కె.తారకరామారావుకు హైకోర్టు శుక్రవారం నోటీసులిచ్చింది. ఆయన ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, రిటర్నింగ్‌ అధికారి అయిన ఆర్డీవోకు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్‌ నామినేషన్‌ సందర్భంగా వాస్తవాలను వెల్లడించలేదని.. అందువల్ల ఎన్నిక చెల్లదని కె.కె.మహేందర్‌రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. భార్య, మైనరు కుమార్తె మాత్రమే తనపై ఆధారపడి ఉన్నట్లు కేటీఆర్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారని పిటిషనర్లు పేర్కొన్నారు. గత ఏడాది జులైలో మేజర్‌ అయిన కేటీఆర్‌ కుమారుడు కె.హిమాన్షు సిద్దిపేట నియోజకవర్గంలోని మర్కూక్‌ మండలం వెంకటాపూర్‌లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో     32.3650 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. వీటి కోసం రూ.10.50 లక్షలు, రూ.88.15 లక్షలు చెల్లించారని, తండ్రి సాయం లేకుండా అంత మొత్తం ఎలా చెల్లించారన్నది వెల్లడించలేదన్నారు. అఫిడవిట్‌లో వాస్తవాలను తొక్కిపెట్టడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123తోపాటు రుక్మిణి మాదగౌడ వర్సెస్‌ ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. వాదనను పరిశీలించిన న్యాయమూర్తి.. 4వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని