ప్రజావాణికి 702 అర్జీలు

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్‌ శాఖ సంచాలకురాలు దివ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

Published : 15 Jun 2024 04:59 IST

మైనార్టీ గురుకుల సొసైటీ ఉద్యోగులతో మాట్లాడుతున్న చిన్నారెడ్డి, దివ్య

సోమాజిగూడ, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్‌ శాఖ సంచాలకురాలు దివ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

  • రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో దినసరి వేతనంపై పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పొరుగుసేవల సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
  • రాష్ట్రవ్యాప్తంగా 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న 1600 మందికి సర్వీసును రెన్యువల్‌ చేస్తూ 12 నెలల కన్సాలిడేటెడ్‌ వేతనం చెల్లించాలని రాష్ట్ర డిగ్రీ గెస్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. 
  • గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలకు ఎంతో గౌరవం ఉందని, కానీ ఇటీవల ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్, టీఎస్‌ఎంసీకి చెందిన సిబ్బంది.. తమ క్లినిక్‌లలో సోదాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాష్ట్ర ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోదాలు ఆపాలని కోరారు. 
  • రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని కాంగ్రెస్‌ మాజీ నేత బక్క జడ్సన్‌ విజ్ఞప్తి చేశారు. మొత్తం 2,67,316 ఉద్యోగ ఖాళీలున్నాయని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 
  • డీఎస్సీ 2012 మొదటి జాబితాలో ఎంపికై సవరణలతో ఉద్యోగాలు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్‌ అభ్యర్థులకు తిరిగి ఉద్యోగాలివ్వాలని బాధితులు వినతిపత్రం అందజేశారు. 
  • హిమోఫీలియా బాధితులను వికలాంగులుగా గుర్తింంచాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులు విన్నవించారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని అధికారిణి దివ్య వారికి తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని