డిజిటల్‌ ప్రపంచానికి ప్రైవసీ ఇంజినీరింగ్‌ మూలస్తంభం

గోప్యతకు సంబంధించి ప్రైవసీ ఇంజినీరింగ్‌ డిజిటల్‌ ప్రపంచానికి మూలస్తంభమని, దీని పటిష్ఠతతోనే డిజిటల్‌ మాధ్యమంపై నమ్మకం బలపడుతుందని రాష్ట్ర ఐటీ, కమ్యునికేషన్స్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.

Published : 15 Jun 2024 05:05 IST

- జయేశ్‌ రంజన్‌

‘ప్రైవసీ ఇంజినీరింగ్, వే ఎహెడ్‌’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జయేశ్‌ రంజన్, శ్రీరామ్‌ బిరుదవోలు

ఈనాడు, హైదరాబాద్‌: గోప్యతకు సంబంధించి ప్రైవసీ ఇంజినీరింగ్‌ డిజిటల్‌ ప్రపంచానికి మూలస్తంభమని, దీని పటిష్ఠతతోనే డిజిటల్‌ మాధ్యమంపై నమ్మకం బలపడుతుందని రాష్ట్ర ఐటీ, కమ్యునికేషన్స్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ‘సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీసీవోఈ) - డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ)’ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. డిజిటల్‌ మాధ్యమంలో గోప్యతను కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారిందని, దీనివల్ల జరుగుతున్న నష్టం అపారమన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఐడీబీఐ శిక్షణ కేంద్రంలో ‘ప్రైవసీ ఇంజినీరింగ్‌’పై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘డేటాను కాపాడడంలో ప్రపంచంలోనే భారత్‌ ముందుంది. యూపీఐ వంటి లావాదేవీల నిర్వహణలో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతుండగా భారత్‌లో మాత్రం సురక్షితంగా సాగుతున్నాయి. ఏఐని వినియోగించి వ్యక్తిగత సమాచార గోప్యతకు భద్రత కల్పించవచ్చు. కేంద్రం యూపీఐ లాగానే నేషనల్‌ హెల్త్‌మిషన్‌ను తీసుకొచ్చింది. దీనిద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించి భద్రపరుస్తారు. ఆ సమాచారాన్ని వైద్యులు వినియోగించి మరింత మెరుగైన, వేగవంత సేవలందించే అవకాశం ఉంటుంది. బీమా సంస్థలూ ఆ డేటాను వాడుకునే వీలుంటుంది’’ అని తెలిపారు. సీసీవోఈ సీఈవో శ్రీరామ్‌ బిరుదవోలు మాట్లాడుతూ పారిశ్రామిక, సాంకేతిక, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో సైబర్‌ భద్రతపై సేవలందించేందుకు 2018లో సీసీవోఈని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు నిపుణులు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల ప్రతినిధులు వివిధ అంశాలపై ప్రసంగించారు. పొసిడెక్స్‌ ఎండీ, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి జీటీ వెంకటేశ్వరరావు, ప్రివాస్సిన్‌ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో అభిలాష్, క్యాప్‌ జెమిని ప్రతినిధి నీతిపౌల్‌; సైబర్‌భద్రత, డేటా ప్రైవసీ నిపుణులు సౌమిక్‌ భట్టాచార్య, సీసీవోఈ ప్రతినిధి మిథాలీ అగర్వాల్, నాస్కామ్‌ సీనియర్‌ సెక్టర్‌ మేనేజర్‌ సెలిస్టైన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని