అవస్థల ప్రయాణం..!

రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది.

Published : 15 Jun 2024 05:44 IST

1,497 గ్రామాలకు ఆర్టీసీ సర్వీసుల్లేవు
అనూహ్యంగా పెరిగిన ప్రయాణికులు.. తగ్గిన బస్సులు
60 నియోజకవర్గాల నుంచి భారీగా డిమాండ్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. 2014-15 నాటికి ఆర్టీసీలో 10,479 బస్సులుండగా 2024 నాటికి 8,574 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో బస్సులు తిరగని గ్రామాలు ఏకంగా 1,497 వరకు ఉన్నాయి. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పలుచోట్ల ఏళ్ల తరబడి నడుస్తున్న బస్సులను తగినంత ఆదాయం లేదన్న కారణంతో డిపో మేనేజర్లు రద్దు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. తమ నియోజకవర్గాల్లో రద్దుచేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల నుంచి ఈ తరహా డిమాండ్లు వచ్చాయి. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే 15 బస్సులు కావాలంటూ ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి రూట్లవారీగా వివరాలిచ్చారు. ఇలా పలువురు ఎమ్మెల్యేల నుంచి బస్సుల కోసం వినతిపత్రాలు అందాయి.

సమస్యను అధిగమించడం ఎలా!

రవాణాశాఖ మంత్రిని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల కలిసినప్పుడు ఈ విషయంపై ప్రధానంగా చర్చ జరిగింది. ‘బస్సులకు డిమాండ్‌ బాగా పెరిగింది.. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి’ అన్న విషయంపై చర్చించారు. మరోసారి సమావేశమవ్వాలని అనుకున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చే బస్సులు తొలి రెండు, మూడు గ్రామాల్లోనే నిండుతున్నాయి. దీంతో తర్వాత గ్రామాలవారు బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంటోంది. 

కొత్త బస్సులు పెరిగితేనే..!

గత ఏడాది డిసెంబరు వరకు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 45 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడా సంఖ్య 55 లక్షలు దాటుతోంది. తదనుగుణంగా బస్సులు మాత్రం లేవు. కొత్త బస్సులు దశలవారీగా వస్తాయని యజమాన్యం చెబుతోంది. అయితే సంస్థలో ఇప్పుడున్న బస్సుల్లో చాలావరకు కాలం చెల్లినవే. వచ్చే కొత్త బస్సులను పాతవాటి స్థానంలో సర్దుబాటు చేస్తూ వస్తుండటంతో అదనంగా కొత్తవాటి సంఖ్య పెరగడం లేదు. ఉదాహరణకు 2017-18లో 915 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 757 డొక్కు బస్సుల స్థానంలో ప్రవేశపెట్టారు. అంటే అదనంగా సమకూరింది 158 మాత్రమే. తర్వాత (2020-21, 2021-22, 2022-23) మూడేళ్లలో వచ్చిన కొత్త బస్సులు 133 మాత్రమే. అవీ పాతబస్సుల స్థానంలో వచ్చినవే. ఈ నేపథ్యంలో అదనంగా పెద్దసంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తేవాలని పలువురు సూచిస్తున్నారు. 

రాష్ట్రంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు, అనేక అవసరాల రీత్యా ప్రయాణాలు చేసే గ్రామీణ ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. వారంతా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాలకు చెందినవారు కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల ప్రయాణికులకూ బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. 

  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో 33 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఎప్పట్నుంచో ఉన్న ఖమ్మం-జక్కేపల్లి సర్వీసునూ ఆర్టీసీ రద్దు చేసింది. రఘనాథపాలెం మండలంలో 15 పంచాయతీలకు, చింతకాని మండలంలో మండలకేంద్రం సహా 21 గ్రామాలకు బస్సులు తిరగడం లేదు.
  • నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి పూసలపాడు, ముల్కలకాల్వకు వెళ్లే రెండు బస్సుల్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్టీసీ రద్దు చేసింది. మిర్యాలగూడ నుంచి తడకమళ్ల, ఇరికిగూడెం, త్రిపురారం-అడవిదేవులపల్లి, కేశవపురం మార్గాల్లో రోజూ 8 ట్రిప్పులు బస్సులు నడిచేవి. ఆదాయం తక్కువ వస్తోందని రెండు నెలల క్రితం రద్దు చేశారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు నడిపిస్తున్నారు.

బస్సెక్కాలంటే 3 కి.మీ. వెళ్లాలి

డిగ్రీలో చేరినప్పుడు మా ఊరికి బస్సొచ్చేది. ఏడాది క్రితం రద్దు చేశారు. బస్సెక్కాలంటే 3 కి.మీ. దూరంలోని నాగులవంచకు వెళ్లాలి. రోజు మా నాన్న పనులు మానుకొని నాగులవంచలో దించి, సాయంత్రం మళ్లీ వస్తున్నారు. నాన్నకి ఏదైనా పని ఉంటే నడిచి వెళ్లాలి. లేదంటే కాలేజీ మానేయాలి. చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

తేలుకుంట్ల మన్విత, పాతర్లపాడు, ఖమ్మం జిల్లా


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని