అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు

తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విక్రయించిన పత్తి విత్తనాలు రైతులకే చేరాయో లేదో... తేల్చేందుకు తనిఖీలు చేయాలని సూచించారు.

Updated : 16 Jun 2024 06:42 IST

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదేశం 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విక్రయించిన పత్తి విత్తనాలు రైతులకే చేరాయో లేదో... తేల్చేందుకు తనిఖీలు చేయాలని సూచించారు. ఈ మేరకు విత్తనాలు, ఎరువుల సరఫరాపై శనివారం సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... ‘‘ప్రస్తుత సీజన్‌ కోసం 7,97,194 టన్నుల యూరియా, 75,278 టన్నుల డీఏపీ, 4,27,057 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 26,396 టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ దిగుమతి చేసుకున్నాం’’ అని వివరించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ‘‘కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన మేరకు నిల్వలను తీసుకురావాలి. ఇప్పటికే రైతులకు 1,09,937 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ అయ్యాయి. పత్తి రైతుల కోసం 1,02,45,888 ప్యాకెట్లు నిల్వ చేయగా... 62 లక్షల ప్యాకెట్లు అమ్ముడయ్యాయి. ఆయిల్‌పామ్‌ కంపెనీలు నిర్దేశిత లక్ష్యాలను సాధించకుంటే, వాటిపై చర్యలు తీసుకోవాలి. సూక్ష్మ, బిందు సేద్యం రాయితీలను ఆయిల్‌పామ్‌తోపాటు ఇతర పంటలకు వర్తింపజేయాలి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో... వ్యవసాయ, ఉద్యాన శాఖల భూములను పలు శాఖలు, సంస్థలకు కేటాయించాం. వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలి. ప్రభుత్వ గోదాములపై సౌరవిద్యుత్‌ యూనిట్లను నెలకొల్పాలి. పహాడిషరీఫ్‌లో సబ్‌మార్కెట్‌ ప్రారంభించాలి’’ అని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ రైతులకు పరికరాలను సమకూర్చిన కంపెనీలకు 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.97 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సంచాలకుడు గోపి, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, ఉద్యాన, మార్కెటింగ్‌ సంచాలకులు అశోక్‌రెడ్డి, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు