నియంతృత్వ, నిర్బంధ పోకడలు తగవు

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనలో సామాజిక మార్పు రాలేదని... నియంతృత్వ పోకడలు, అణచివేత, నిర్బంధాలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

Published : 16 Jun 2024 06:14 IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డానీ, ప్రొ.హరగోపాల్, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, రామచంద్రమూర్తి, మాడభూషి శ్రీధర్, విశ్వేశ్వర్‌రావు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనలో సామాజిక మార్పు రాలేదని... నియంతృత్వ పోకడలు, అణచివేత, నిర్బంధాలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో... ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ రాసిన ‘భారత రాజ్యాంగ పీఠిక’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి వక్తలతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగియగానే సామాజికవేత్త అరుంధతీరాయ్‌పై ఉపా కేసు నమోదు చేయడం ప్రస్తుత పాలకుల వైఖరిని ప్రతిబింబిస్తోంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదేశికసూత్రాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. దేశంలో అధికారాలు రాష్ట్రాలకు విశేషంగా.. కేంద్రానికి పరిమితంగా ఉండాలని నాటి ప్రధాని నెహ్రూ ప్రస్తావించిన విషయాన్ని మరచిపోవద్దు. ‘లెటర్‌ అండ్‌ స్పిరిట్‌’ విషయంలో పాలకులతోపాటు న్యాయవ్యవస్థా విఫలమైంది. రాజ్యాంగాన్ని రూపకల్పనలో అంబేడ్కర్‌ది గొప్ప పాత్ర. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలకు చెంపపెట్టులాంటి తీర్పును ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చారు.’’ అని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. వివక్ష, అసమానతలు లేకుండా ప్రతిఒక్కరూ గౌరవంగా జీవించేలా సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకుని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి మహాప్రస్థానం కాఫీటేబుల్‌ పుస్తకాన్ని కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ అందజేశారు.  సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, రచయిత విశ్వేశ్వర్‌రావు, డానీ, కల్యాణి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు