బీసీలు మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలి

ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన కోసం బీసీలు మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు.

Published : 16 Jun 2024 06:15 IST

ఆర్‌.కృష్ణయ్య

ఐక్యత చాటుతున్న దత్తాత్రేయ, నరేందర్, శ్రీనివాస్‌యాదవ్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్,
రాజారామ్‌ యాదవ్, ఆర్‌.కృష్ణయ్య, ఆనంద్‌ భాస్కర్, గౌరీశంకర్‌

రాంనగర్, న్యూస్‌టుడే: ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన కోసం బీసీలు మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సమగ్ర కులగణన చేపట్టి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ కులసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, బీసీ ఓట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. సంబంధిత వర్గాలకు నష్టం చేస్తే ఊరుకోబోమన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ మేరకు.. జనాభా దామాషా ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లోనూ అవకాశమివ్వాలని డిమాండ్‌ చేశారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు.. రాజకీయాల్లో 14 శాతం, ఉద్యోగాల్లో 9 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. ‘కామారెడ్డి డిక్లరేషన్‌’ అమలుపై తక్షణం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ మాట్లాడుతూ.. బీసీ ఐక్య ఉద్యమాలు మరింత బలపడి రాజ్యాధికారం చేపట్టే శక్తిగా మారాలన్నారు. భారాస నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి ఆర్నెల్లు అవుతున్నా.. ‘కామారెడ్డి డిక్లరేషన్‌’ అమలుకు చర్యలు చేపట్టిన దాఖలాల్లేవని అన్నారు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్‌ ఇండియా ఓబీసీ ఐకాస ఛైర్మన్‌ నరేందర్, బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు గౌరీశంకర్, వివిధ సంఘాల నేతలు మేకల కృష్ణ, దత్తాత్రేయ, శ్రీనివాస్‌యాదవ్, శారద, అరుణ, భారాస నాయకులు ముఠా జైసింహ, రోషం బాలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని