నల్లమలలో చిరుత మృతి

నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ చిరుత మృతి చెందడం కలకలం రేపింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఈగలపెంట శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో రహదారి పక్కన మృతిచెందిన చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

Updated : 16 Jun 2024 06:41 IST

దోమలపెంట (అమ్రాబాద్‌), న్యూస్‌టుడే: నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ చిరుత మృతి చెందడం కలకలం రేపింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఈగలపెంట శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో రహదారి పక్కన మృతిచెందిన చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం అటవీ రేంజ్‌ అధికారి గురుప్రసాద్‌ సిబ్బందితో వెళ్లి చిరుత దంతాలు, కాలి గోళ్లు, శరీరాన్ని పరిశీలించారు. సుమారు 8 నెలల వయసున్న మగ చిరుతపులి పిల్లగా గుర్తించారు. రహదారి పక్కన రెయిలింగ్‌ సమీపంలో ఓ రాయిపై పడి ఉండటంతో రోడ్డు ప్రమాదమా.. మరేదైనా కారణమా అని ఆరా తీశారు. చిరుత గొంతు వద్ద రెండుగాట్ల కారణంగా ఇతర జంతువుల దాడిలో మృతి చెంది ఉండొచ్చని ఎఫ్‌ఆర్వో అనుమానం వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో అడవి కుక్కల సంచారం ఉందని తెలిపారు. అమ్రాబాద్‌ పశువైద్యాధికారి డా.అనిల్‌ పోస్టుమార్టం చేశారు. శరీరంపై ఎక్కడ బలమైన గాయాలు లేవని, గొంతుపై రెండు గాయాలున్నాయని, ఇతర జంతువుల దాడిలో షాక్‌కు గురై మృతి చెంది ఉండొచ్చని పశువైద్యాధికారి తెలిపారు. శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ సుశాంత్‌ సమక్షంలో పంచనామా చేసి అటవీ ప్రాంతంలో చిరుత కళేబరాన్ని దహనంచేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బాపురెడ్డి, రేంజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు