ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తల ధర్నా

రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందించాలని, ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌(బీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 16 Jun 2024 06:18 IST

ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలు

సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందించాలని, ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌(బీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో శనివారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌ ఆవరణలోని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌(సీఎఫ్‌డబ్ల్యూ) కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరై తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాంబాబుయాదవ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆశా కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అర్హులైన వారి సర్వీసులు క్రమబద్ధీకరించాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.సంతోష మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నా తమకు తగిన గుర్తింపు దక్కడం లేదన్నారు. అనంతరం సీఎఫ్‌డబ్ల్యూకు వినతిపత్రం ఇచ్చేందుకు మూకుమ్మడిగా కార్యాలయం వైపు దూసుకెళ్లడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాంబాబు యాదవ్‌ నేతృత్వంలో 10 మందితో కూడిన ప్రతినిధి బృందం లోనికి వెళ్లి వినతిపత్రం అందజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు