నిన్నటి మనస్తత్వంతో రేపటి పోరాటం చేయలేం

Published : 16 Jun 2024 06:18 IST

యుద్ధరీతులకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
దుండిగల్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరి

దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరి

ఈనాడు, హైదరాబాద్, దుండిగల్, న్యూస్‌టుడే: ఆధునిక కాలంలో మారుతున్న యుద్ధరీతులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని సర్వసన్నద్ధంగా ఉండాలని భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరి అన్నారు. నిన్నటి మనస్తత్వంతో భవిష్యత్తు యుద్ధాల్లో పోరాడలేమని చెప్పారు. యుద్ధాలు ఇకపై పూర్తిగా భౌతికపరమైన వాటికే పరిమితం కాకుండా డేటా నెట్‌వర్క్‌లు, అత్యాధునిక సైబర్‌ టెక్నాలజీస్‌ వంటి వాటిని ఎక్కువగా ప్రభావితం చేసేలా డైనమిక్‌గా ఉండబోతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం జరిగిన కంబైౖన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ అనంతరం వాయుసేనలో చేరిన యువ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నాయకులుగా యుద్ధాల్లో గెలుపొందేందుకు.. తమను తాము నిరూపించుకునేందుకు నూతన ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవాలన్నారు. 235 మంది క్యాడెట్లు వేర్వేరు విభాగాల్లో శిక్షణ పూర్తిచేసుకుని వాయుసేనలో చేరారు. ఇందులో 22 మంది మహిళలు, తొమ్మిదేసి మంది భారత నౌకాదళం, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్, ఒకరు వియత్నాం నుంచి వచ్చిన క్యాడెట్‌ శిక్షణ విజయవంతంగా పూర్తి చేశారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ)లో నాలుగేళ్ల క్రితం గ్రౌండ్‌ డ్యూటీలో చేరిన 25 మంది క్యాడెట్స్‌కు ఇదే మొదటి కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ కావడం విశేషం. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన హ్యాపి సింగ్‌కు రాష్టపతి పతకాన్ని ఎయిర్‌ ఛీప్‌ మార్షల్‌ ప్రదానం చేశారు. చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌స్టాఫ్‌ స్వార్డ్‌ గౌరవం కూడా హ్యాపి సింగ్‌కే దక్కింది. గ్రౌండ్‌ డ్యూటీలో టఫిక్‌ రాజా రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నారు. 

సూర్యకిరణ్‌ విమానాల విన్యాసాలు

మంత్రముగ్ధుల్ని చేసిన వైమానిక విన్యాసాలు 

ఠగ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ అనంతరం ప్రదర్శించిన వైమానిక విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఏరోబాటిక్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సారంగ్‌ హెలికాప్టర్, సూర్యకిరణ్‌ విమానాల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. సుఖోయ్‌ శబ్దంతో ప్రాంగణం దద్దరిల్లింది. ఇది గంటకు 200 కి.మీ. అతి నెమ్మదిగా.. 600 నుంచి 800 కి.మీ అతి వేగంతోనూ రయ్‌మని దూసుకుపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని