తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఇన్‌ఛార్జి వీసీలే

రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు మరికొంత కాలం ఐఏఎస్‌ అధికారులే ఇన్‌ఛార్జి ఉపకులపతులుగా వ్యవహరించనున్నారు. ఇన్‌ఛార్జి వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవోలు జారీ చేశారు.

Published : 16 Jun 2024 06:18 IST

పది వర్సిటీలకు వేర్వేరు జీవోల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు మరికొంత కాలం ఐఏఎస్‌ అధికారులే ఇన్‌ఛార్జి ఉపకులపతులుగా వ్యవహరించనున్నారు. ఇన్‌ఛార్జి వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవోలు జారీ చేశారు. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 వర్సిటీలకు శాశ్వత ఉపకులపతుల పదవీకాలం మే 21తో ముగిసిన సంగతి తెలిసిందే. దాంతో ఒక్కో వర్సిటీకి ఒక్కో ఐఏఎస్‌ అధికారిని ఇన్‌ఛార్జి వీసీగా ప్రభుత్వం నియమించింది. కొత్త ఉపకులపతులను నియమించే వరకు లేదా జూన్‌ 15వ తేదీ...అందులో ఏది ముందైతే అది వర్తిస్తుందని ఆనాడు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ గడువు శనివారంతో ముగిసినా శాశ్వత ఉపకులపతుల నియామకం జరగకపోవడంతో ఇప్పటికే కొనసాగుతున్న ఇన్‌ఛార్జి వీసీలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగాలని వేర్వేరు జీవోలు జారీ చేశారు. దీంతో రెగ్యులర్‌ వీసీల నియామకం ఎప్పటికి పూర్తవుతుందో ప్రభుత్వం ఇంకా ఒక అంచనాకు రాలేదని స్పష్టమవుతోంది. జేఎన్‌టీయూహెచ్‌కు బుర్రా వెంకటేశమే ఇన్‌ఛార్జి వీసీగా కొనసాగనున్నారు. మరో వైపు బాసరలోని ఆర్‌జీయూకేటీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకట రమణ గత రెండేళ్లుగా ఇన్‌ఛార్జి వీసీగా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని