ఖాళీల్లోనే ఆ పాఠశాలలు ఆదర్శం!

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి.

Published : 16 Jun 2024 06:22 IST

194 మోడల్‌ స్కూళ్లలో 91 చోట్ల ప్రిన్సిపాళ్లు లేరు 
ఇన్‌ఛార్జులుగా సీనియర్‌ అధ్యాపకులే...
11 ఏళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు లేవు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఉపాధ్యాయుల ఖాళీలతో.. హాస్టళ్ల వసతి పెంచకపోవడంతో ఇతర గ్రామాల పిల్లలు కష్టాలు పడుతున్నారు. ఆరు నుంచి ఇంటర్‌ వరకు విద్యనందించేందుకు రాష్ట్రంలో 2012-13 విద్యాసంవత్సరం నుంచి 194 ఆదర్శ పాఠశాలలను ప్రారంభించారు. వాటిల్లో 91 చోట్ల శాశ్వత ప్రిన్సిపాళ్లు లేరు. దీంతో అక్కడి సీనియర్‌ ఉపాధ్యాయుడికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారు సబ్జెక్టు పాఠాలు బోధించాల్సి ఉండటం.. పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో రెండింటికీ న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. ఇక 3,686 మంది ఉపాధ్యాయులకు 956 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విచిత్రమేమంటే 11 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ కాలేదు. దాంతో అవర్లీ బేస్డ్‌ టీచర్ల(హెచ్‌బీటీ)ను నియమిస్తున్నారు. వారిని కూడా బడులు తెరిచిన తర్వాత ఎప్పుడో విధుల్లోకి తీసుకుంటున్నారు. గత విద్యా సంవత్సరం(2023-24) ఆగస్టు నెలలో వీరి నియామకం జరిగింది. 

అరకొరగా హాస్టల్‌ వసతి 

ఆరు నుంచి పదో తరగతి వరకు 500 మంది, ఇంటర్‌ రెండేళ్లకు.. నాలుగు గ్రూపుల్లో 320 మంది విద్యార్థులు.. మొత్తం 820 మంది ఒక పాఠశాలలో ఉంటారు. వీరిలో 100 మంది ఇంటర్‌ అమ్మాయిలకు మాత్రమే హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. అదీ.. 194 పాఠశాలల్లో 163 చోట్ల మాత్రమే. ఈ పాఠశాలలకు 5-10 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు వస్తుంటారు. వారు ఆటోలు, సైకిళ్లపై రాకపోకలు సాగిస్తూ.. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం.

వారి మొర ఆలకించేదెవరు 

తమను నియమించి 11 ఏళ్లయినా కనీసం బదిలీలు చేయలేదని ఉపాధ్యాయులు మొరపెట్టుకోవడంతో గత ఆగస్టులో అందుకు విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. చివర్లో కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దానిపై ఫిబ్రవరిలో హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. కేసు త్వరగా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం ప్రయత్నించడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పదోన్నతులు ఇవ్వకపోవడంతో పీజీటీలు, ప్రిన్సిపాల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ప్రభుత్వం ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి 

‘ఈ పాఠశాలలను గతంలో యూపీఏ ప్రభుత్వమే ప్రారంభించింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కారు దీన్ని ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడెడ్‌ ద్వారా కాకుండా 010 పద్దు ద్వారా(ట్రెజరీ) వేతనాలు అందించాలి’ అని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు పేర్కొన్నారు. ‘ఇంటర్‌ విద్య బోధిస్తున్నా జూనియర్‌ లెక్చరర్‌గా పరిగణించడం లేదు. రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లకు గెజిటెడ్‌ హోదా ఇవ్వడం లేదు’ అని ప్రోగ్రెసివ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్‌ ఆవేదన చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు