నేర చరిత్ర ఉన్నవారిని పనుల్లో పెట్టుకోకూడదు: మంత్రి శ్రీధర్‌బాబు

వలస కూలీల నియామకాల్లో పరిశ్రమల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

Published : 17 Jun 2024 04:38 IST

కాట్నపల్లిలో ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పక్కన ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్, విజయరమణారావు

పెద్దపల్లి, సుల్తానాబాద్, న్యూస్‌టుడే: వలస కూలీల నియామకాల్లో పరిశ్రమల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని బియ్యం మిల్లులో గురువారం అర్ధరాత్రి చిన్నారిపై ఘటన జరిగిన ప్రాంతాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌లతో కలిసి పరిశీలించారు. అనంతరం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని వివిధ రంగాలలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. ‘‘ప్రస్తుతం వారి ప్రవర్తనను గమనించండి. అలాగే నేర చరిత్ర ఉన్నవారిని పనుల్లో పెట్టుకోకూడదు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబానికి మిల్లు తరఫున రూ.5 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.2.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. పని కేంద్రాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులతో నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నాం. బాధిత కుటుంబానికి ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాం’’ అని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గంజాయి, మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశముందన్నారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని