తెలంగాణకు ఏపీ ఉద్యోగుల మార్పిడి తప్పుడు ప్రచారమే

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉద్యోగులు తెలంగాణలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, దాన్ని నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్పడిన ఏడాది, రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని.. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలేమీ తీసుకోలేదని పేర్కొంది.

Updated : 18 Jun 2024 16:10 IST

ప్రభుత్వం స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉద్యోగులు తెలంగాణలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, దాన్ని నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్పడిన ఏడాది, రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని.. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలేమీ తీసుకోలేదని పేర్కొంది. ఓవైపు తప్పుడు ప్రచారంపై సీఎంఓ కార్యాలయం సోమవారం ఆరా తీయగా మరోవైపు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

సీఎం నివేదిక కోరడంతో..

వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరిని ఏపీకి, ఏపీ స్థానికత ఉన్న కొందరిని తెలంగాణకు కేటాయించారు. వైద్య అవసరాలు, భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉండటం, పిల్లల చదువులు తదితర కారణాలతో కొందరు ఇబ్బందులు పడ్డారు. ఏపీకి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణకు కేటాయించిన 1,369 మంది కోరగా వారి వివరాలు సేకరించిన ప్రభుత్వం తమకెలాంటి అభ్యంతరం లేదని 2021 సెప్టెంబరులో సర్క్యులర్‌ జారీ చేసింది. ఇదే తరహాలో ఏపీ సర్కారు కూడా అక్కడి నుంచి తెలంగాణకు వచ్చేందుకు సిద్ధపడిన 1,808 మంది వివరాలు సేకరించింది. 2022 సెప్టెంబరు 23న అప్పటి ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ.. తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌కు ఇదే విషయంపై లేఖ రాశారు. ఉద్యోగుల పరస్పర బదిలీకి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇది ఏళ్లుగా నానుతున్న వ్యవహారం. విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగినప్పుడల్లా దీనిపైనా చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ జూన్‌ 2 నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఏర్పడింది. ఈ సందర్భంగా ఏపీకి కేటాయించిన ఆఫీసులు, భవనాలతోపాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అంశాలు, అపరిష్కృత సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం పరస్పర ఉద్యోగుల మార్పిడిపైనా సమాచారం సేకరించింది. దీంతో ఏపీలో ఉన్న ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయనే ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే సీఎం సమాచారమైతే కోరారు గాని.. విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై తదుపరి చర్చలు, సమావేశాలేవీ ఇప్పటి వరకూ జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని