సంక్షిప్త వార్తలు (7)

సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఉద్యోగుల సమాచారంతో పాటు సేవలు, సమాచారం, సాంకేతికతను వినియోగిస్తున్న సింగరేణిని అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా ఎక్స్‌ప్రెస్‌ కంప్యూటర్‌ సంస్థ గుర్తించింది.

Published : 18 Jun 2024 03:27 IST

సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ అవార్డు

అవార్డును సీఎండీ బలరాంకు అందిస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్, గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఉద్యోగుల సమాచారంతో పాటు సేవలు, సమాచారం, సాంకేతికతను వినియోగిస్తున్న సింగరేణిని అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా ఎక్స్‌ప్రెస్‌ కంప్యూటర్‌ సంస్థ గుర్తించింది. ఆదివారం రాజస్థాన్‌ రాష్ట్రం జైపుర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును సంస్థ కోఆర్డినేటింగ్‌ జీఎం దేవేందర్, ఈఆర్‌పీ ప్రాజెక్టు మేనేజర్‌ హరప్రసాద్, ఐటీ విభాగం డీజీఎంలు హరిశంకర్, హరిప్రసాద్, మేనేజర్‌ రామలక్ష్మయ్యలు అందుకున్నారు. సోమవారం ఉదయం అవార్డును సీఎండీ బలరాంకు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ..దేశంలో ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్సు ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న మొట్టమొదటి బొగ్గు కంపెనీగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుందని ఉద్యోగులను అభినందించారు. సంస్థను కాగితపురహిత కంపెనీగా రూపుదిద్దాలని పిలుపునిచ్చారు. 


ఆలంఖాన్‌ నివాసానికి సీఎం రేవంత్‌ రెడ్డి.. కుటుంబ సభ్యులకు బక్రీద్‌ శుభాకాంక్షలు

‘అన్వర్‌ ఉల్‌ ఉలూమ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ’ సెక్రెటరీ నవాబ్‌ ముజాహిద్‌ ఆలంఖాన్‌ నివాసానికి సోమవారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. బక్రీద్‌ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌


ఎన్పీడీసీఎల్‌లో విద్యుత్‌ ప్రజావాణి ప్రారంభం

హనుమకొండ(బాలసముద్రం), న్యూస్‌టుడే: వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఎన్పీడీసీఎల్‌ అధికారులు సోమవారం ‘విద్యుత్‌ ప్రజావాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఉన్న 16 జిల్లాల్లోని సర్కిల్‌ కార్యాలయాల నుంచి కిందిస్థాయి సబ్‌ డివిజన్, సెక్షన్‌ కార్యాలయాల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్‌ సంబంధిత అంశాలు, సమస్యలపై తొలి రోజు 362 ఫిర్యాదులు వచ్చాయి. వినియోగదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తామని సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.


దక్షిణ కొరియాకు భారజలం ఎగుమతి 

అశ్వాపురం, న్యూస్‌టుడే: దక్షిణ కొరియాకు 20 వేల లీటర్ల భారజలాన్ని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు భారజల ప్లాంటు నుంచి ఎగుమతి చేశారు. గౌతమీనగర్‌లోని పర్ణశాల అతిథిగృహం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారజలం ఉన్న కంటైనర్‌ వాహనాన్ని భారజల బోర్డు ఛైర్మన్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌.సత్యకుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాల బందోబస్తు మధ్య తొలుత ఈ వాహనం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దక్షిణ కొరియాకు చేరుకోనుంది. ప్లాంటు జీఎం ఎస్‌.జగ్గారావు, డీజీఎంలు జి.శ్రీనివాసరావు, హెచ్‌.కె.శర్మ, జగన్నాథశర్మ, ఏడీఎంఓ రాఖీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


20 నుంచి సమృద్ధిగా వర్షాలు.. ఇండోజర్మన్‌ బృందం అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు అవకాశం ఉందని ఇండో జర్మన్‌ శాస్త్రవేత్తల బృందం అంచనా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ సోమవారం తెలిపారు. ప్రొఫెసర్‌ ఎలెనా సురోవ్యక్తినా నేతృత్వంలోని ఇండో జర్మనీ శాస్త్రవేత్తల బృందం భారత్‌లో వాతావరణంపై అధ్యయనం చేసి ఈ సమాచారం ఇచ్చిందని తెలిపారు. దీని ప్రకారం పశ్చిమ తెలంగాణలో ఈ నెల 20 నుంచి, తూర్పు తెలంగాణలో 21 నుంచి, ఉత్తర తెలంగాణలో 22 నుంచి వర్షాలు పడతాయని ఈ బృందం అంచనా వేసినట్లు వెల్లడించారు.


‘రచయిత్రి అరుంధతిపై ఉపా కేసులు ఎత్తివేయాలి’ 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమిస్తున్న రచయిత్రి అరుంధతి రాయ్, ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌పై పెట్టిన ఉపా కేసులు ఎత్తివేయాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ కార్యదర్శి రంగారావు డిమాండ్‌ చేశారు. 14 ఏళ్ల క్రితం కశ్మీర్‌ అంశంపై మాట్లాడితే ఇప్పుడు కేసులు పెట్టారని, హక్కుల కోసం ఉద్యమం చేసే వారిపై హింసించే చర్యలు నిలిపివేయాలని కోరారు. దేశంలో హక్కులు, ప్రజాస్వామిక విలువలపై మాట్లాడితే దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించి, బాధ్యులను శిక్షించాలన్నారు. 


ఈసెట్‌ తొలి విడత సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఈసెట్‌ తొలి విడత సీట్లను సోమవారం కేటాయించారు. మొత్తం 13,965 సీట్లు అందుబాటులో ఉండగా.. 12,703 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. వారిలో 8,982 మందికి సీట్లు దక్కాయి. 8,951 మంది బీటెక్, 31 మంది బీఫార్మసీలో సీట్లు పొందారు. వారందరూ నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని