ఆర్థిక భద్రత కరవు.. అనారోగ్య సమస్యలు

దేశంలో వృద్ధులకు ఆర్థిక భద్రత లోపించిందని హెల్పేజ్‌ ఇండియా సంస్థ నివేదిక వెల్లడించింది. జీవన చరమాంకంలో వేధింపులు పెరుగుతున్నాయని, కుటుంబంలో ఆర్థిక స్వాతంత్య్రం లభించక నిస్సహాయులుగా ఉంటున్నారని తెలిపింది. తమపై జరుగుతున్న దాడులపై నోరువిప్పి వృద్ధులు ఫిర్యాదు చేయలేకపోతున్నారని పేర్కొంది.

Published : 18 Jun 2024 03:30 IST

రోజువారీ కార్యకలాపాల నిర్వహణకూ ఇబ్బందులు
దేశంలో వృద్ధాప్య సవాళ్లపై హెల్పేజ్‌ ఇండియా అధ్యయనం
ఈనాడు, హైదరాబాద్‌

దేశంలో వృద్ధులకు ఆర్థిక భద్రత లోపించిందని హెల్పేజ్‌ ఇండియా సంస్థ నివేదిక వెల్లడించింది. జీవన చరమాంకంలో వేధింపులు పెరుగుతున్నాయని, కుటుంబంలో ఆర్థిక స్వాతంత్య్రం లభించక నిస్సహాయులుగా ఉంటున్నారని తెలిపింది. తమపై జరుగుతున్న దాడులపై నోరువిప్పి వృద్ధులు ఫిర్యాదు చేయలేకపోతున్నారని పేర్కొంది. ‘భారతదేశంలో వృద్ధాప్యం- సంసిద్ధత, సవాళ్లు’ పేరిట ఆ సంస్థ తాజాగా ఈ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 20 ప్రథమ, ద్వితీయశ్రేణి నగరాల్లోని వృద్ధులు, వారి సంరక్షకుల సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసినట్లు సంస్థ తెలిపింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వారిలో చాలా మందికి కుటుంబం నుంచి సేవలు అందుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

71 శాతం మంది వృద్ధులకు దక్కని ఆర్థిక భరోసా

దేశంలో 71 శాతం మంది వృద్ధులకు కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక భరోసా లభించడం లేదు. పురుషులతో పోలిస్తే మహిళలకు సరైన ఆదాయం లేకపోవడంతో.. వారిలో ఆర్థిక అభద్రతభావం ఎక్కువగా ఉంటోంది. 29 శాతం మందికే వృద్ధాప్య పింఛను, పింఛను లాంటి సామాజిక భద్రతా పథకాలు అందుతున్నాయి. వివిధ మార్గాల ద్వారా వృద్ధులకు లభిస్తున్న ఆదాయం ఏడాదికి రూ.50 వేల లోపే ఉంటోంది. ఈ మొత్తం ఆర్థిక భద్రతకు సరిపడేలా లేదని వారు స్పష్టం చేస్తున్నారు. 

  • పదవీ విరమణ తరువాత 15 శాతం మంది వృద్ధులు పనిచేస్తున్నా.. వారికి వచ్చే వేతనం తక్కువగా ఉంటోంది. పనిచేస్తున్న ప్రదేశాలు దూరంగా ఉండటంతో పాటు ఎక్కువ మంది అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. 
  • 90 శాతానికిపైగా వృద్ధులకు సామాజిక సంఘాల్లో ఎలాంటి సభ్యత్వం లేదు. 
  • 7 శాతం మంది వృద్ధులు వేధింపులు ఎదుర్కొంటున్నారు. మరో ఆరు శాతం మంది దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు.
  • 15 శాతం మందికి మాత్రమే ఆసుపత్రుల్లో వృద్ధులకు సంబంధించిన వైద్యసేవలపై అవగాహన ఉంది. 31 శాతం మంది వృద్ధులకే ఆరోగ్య బీమా ఉంది.

వయసుతో పెరుగుతున్న అనారోగ్యం...

  • 50 శాతం మంది వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరు రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ రక్తపోటు, మధుమేహం, మోకాళ్ల నొప్పులు, ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 80 ఏళ్ల వయసులో సగం మంది మూడుకన్నా ఎక్కువ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
  • వృద్ధులు అవుట్‌ పేషెంట్‌ వైద్యసేవల కోసం చేస్తున్న సగటు ఖర్చు రూ.1973గా ఉంది. ఈ ఖర్చు పురుషుల్లో రూ.2027 ఉంటే.. మహిళల్లో రూ.1913గా ఉంది.
  • ప్రతిముగ్గురిలో ఒకరు అనారోగ్య సమస్యలతో కొన్నిసార్లు మంచానికే పరిమితమవుతున్నారు. వీరికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతోందని సర్వేలో వెల్లడైంది.

రెట్టింపు కానున్న వృద్ధులు

‘‘భవిష్యత్తులో 60 ఏళ్లు దాటిన వారి జనాభా దేశంలో గణనీయంగా పెరగనుంది. 2050 నాటికి జనాభాలో వీరి శాతం ప్రస్తుతమున్న 10 నుంచి  20.8 శాతానికి చేరనుంది. అదే సమయంలో కుటుంబాల్లో వృద్ధులను చూసుకునే సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటోంది. కొందరు వృద్ధులు పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా, సరైన అవకాశాలు లేవు. వైద్య సదుపాయాలు, సామాజిక రక్షణ, టెక్నాలజీకి దూరంగా ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని