60 ఏళ్లా.. 64 ఏళ్లా?

రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ) పోస్టుకు గరిష్ఠ వయోపరిమితిగా ఏ వయసును ప్రాతిపదికగా తీసుకోవాలనే అంశంపై పీటముడి వీడటం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి రెగ్యులర్‌ డీఎంఈని నియమించడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తర్జన భర్జన పడుతోంది.

Updated : 18 Jun 2024 05:58 IST

రెగ్యులర్‌ డీఎంఈ పోస్టుకు గరిష్ఠ వయో పరిమితిపై వీడని పీటముడి
64 సంవత్సరాలే ప్రాతిపదికైతే చట్ట సవరణ తప్పనిసరి
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ తర్జనభర్జన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ) పోస్టుకు గరిష్ఠ వయోపరిమితిగా ఏ వయసును ప్రాతిపదికగా తీసుకోవాలనే అంశంపై పీటముడి వీడటం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి రెగ్యులర్‌ డీఎంఈని నియమించడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తర్జన భర్జన పడుతోంది. త్వరగా నియామకం జరపాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. త్వరలో డీపీసీ(డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో వైద్యవర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకానికి ప్రొఫెసర్ల గరిష్ఠ వయోపరిమితిని 60 ఏళ్లుగా తీసుకోవాలా? లేదంటే 64 ఏళ్లా అనేది స్పష్టత రావడంలేదు. 

చట్టబద్ధత లేకపోవడంతో.. 

రాష్ట్రంలో పదవీ విరమణ వయసు 58 ఏళ్లు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులైన డీఎంఈ, అదనపు డీఎంఈ, వైద్యకళాశాల ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ల నియామకాలు చేపట్టినప్పుడు కనీసం ఏడాది సర్వీసు ఉండేలా గరిష్ఠ వయసును 57గా పరిగణనలోకి తీసుకునేవారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచారు. ఈ నేపథ్యంలో డీఎంఈ పోస్టులో నియమితులయ్యేవారి గరిష్ఠ వయసు 60 ఉండాలని వైద్య విభాగంలోని ఒక వర్గం అభిప్రాయం. మరోవైపు ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచింది. అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టుల నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి 64 ఏళ్లను ప్రాతిపదికగా తీసుకోవాలని మరో వర్గం వాదన. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా పెంచినప్పుడే నియామకాల వయసును చట్టంలో చేర్చకపోవడంతో సమస్య జటిలమైంది. దీనికి పరిష్కారంగా గత ప్రభుత్వం ఆ చట్టానికి సవరణలను ప్రతిపాదించింది. నియామకాలకు 64 ఏళ్లను ప్రాతిపదికగా తీసుకునేలా శాసనసభ, మండలి ఆమోదించాయి. ఈ బిల్లును అప్పటి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆమోదానికి పంపగా తిరస్కరించారు. దీంతో ఆ ప్రతిపాదనలకు చట్టబద్ధత లభించలేదు. ప్రస్తుత ప్రభుత్వం డీఎంఈ పోస్టుకు 64 ఏళ్లను ప్రాతిపదికగా తీసుకోవాలంటే చట్టంగా రూపొందాలని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చట్ట సవరణ జరగకుంటే 60 ఏళ్లనే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నాయి. 

రెండు జాబితాలు సిద్ధం చేసి.. 

రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌ రూపొందించిన ప్రాథమిక సీనియారిటీ జాబితా ప్రకారం 64 ఏళ్లను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత అడిషనల్‌ డీఎంఈ కె.శివరాంప్రసాద్, వనపర్తి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎ.నరేంద్రకుమార్, ఇన్‌ఛార్జి డీఎంఈ ఎన్‌.వాణి మొదటి మూడు స్థానాల్లో ఉంటారు. 60 ఏళ్లను ప్రాతిపదికగా తీసుకుంటే నాగర్‌కర్నూల్, కాకతీయ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎం.రమాదేవి, డి.మోహన్‌దాస్, ఉస్మానియా ఆసుపత్రి అడిషనల్‌ సూపరింటెండెంట్‌ త్రివేణి సీనియారిటీలో మొదటి మూడుస్థానాల్లో ఉంటారు. రెగ్యులర్‌ డీఎంఈని నియమించి హైకోర్టుకు తెలియజేయాల్సిన నేపథ్యంలో ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చే దిశగా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టిసారించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని